రాంనగర్/మానకొండూర్, ఏప్రిల్ 20 : మానకొండూర్ కాల్పుల ఘటనలో మిస్టరీ వీడడంలేదు. గోదావరిఖనికి చెందిన సాయితేజ, రౌడీషీటర్ అరుణ్‌కు మధ్య గల పాతకక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం రాత్రి సాయితేజ.. ప్రదీప్‌కుమార్, మల్లేశ్‌తో కలిసి బైక్‌పై మానకొండూర్‌కు వచ్చారు. అరుణ్ ఇంటి అడ్రస్ అడుగుకుంటూ వచ్చి ఆయన ఇంటి ముందు కనబడగానే ఒక్కసారిగా దాడిచేశారు. తప్పించుకొని పారిపోయిన అరుణ్ బంధువుల ఇంట్లో తలదాచుకొని కేకలు వేశాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై మల్లేశ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే ప్రదీప్‌కుమార్, సాయితేజ పరారయ్యారు. ఈ ఘటనలో తుపాకీతో కాల్పులు జ రిపినట్లు అక్కడ దొరికిన బుల్లెట్ సెల్స్‌ను బట్టి నిర్థారణకు వచ్చిన పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మల్లేశ్‌ను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అరుణ్‌తో పాటు అక్కడే ఉన్న మధును కూడా అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. అయితే జిల్లా బహిష్కరణ తర్వాత అరుణ్ ఈ మధ్యే తన తండ్రి సంవత్సరీకం కోసం గ్రామానికి వచ్చాడని బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితులు దాడి చేశారని చెప్పారు.
గోదావరిఖనికి చెందిన సాయితేజ గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి ఏడాదికిపైగా జైలుశిక్ష అనుభవించాడు..ఆయితే పోలీసులతో సన్నిహిత సంబంధాలున్న అరుణే తనను పట్టించాడని, అదే సమయంలో ఓ యువతి ఆత్మహత్యకు ఆయనే కారకుడని భావించి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అరుణ్‌ను అంతం చేయాలని పథకం పన్నాడని పోలీసులు తెలిపారు. సాయితేజ పట్టుబడితే తప్ప పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉన్నది. అరుణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది.