Road Accident | చిగురుమామిడి, ఆగస్టు 29 : చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు. నారాయణ ఈనెల 22న ద్విచక్ర వాహనంపై ముల్కనూరు నుండి రామంచకు వెళుతుండగా ముల్కనూర్ ఊరి బయట క్రాస్ రోడ్ వద్ద ఇందుర్తి నుంచి వస్తున్న కారు నారాయణకు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది.
వెంటనే కరీంనగర్లో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి సోదరుడు పులి రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
కాగా మృతుడికి భార్య, ముగ్గురు కూతుర్లు కలరు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గీట్ల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఒంటెల కిషన్ రెడ్డి, సిద్ధెంకి రాజమల్లు, పులి కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరారు. అతడి మృతి పట్ల గ్రామస్తులు సానుభూతి వ్యక్తం చేశారు.