Man dies | ధర్మారం, సెప్టెంబర్ 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో గుండేటి మల్లేశం (43) అనే వ్యక్తి గురువారం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కూలినాలి చేస్తుంది. మల్లేశం తన ఇంటి వద్ద పాడి పశువులు పెంచుతున్నాడు. వాటికి పచ్చి మేత కోసి తీసుకురావడానికి ఉదయం 10 గంటల సమయంలో గ్రామ శివారులోని వరి పొలాల్లోకి వెళ్లాడు.
ఆ సమయంలో బత్తుల రాజమల్లవ్వ అనే మహిళ వ్యవసాయ బావి ఒడ్డుపై మల్లేశం గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. దీంతో బావిలో మునిగిన మల్లేశం ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఎంతసేపటికి మల్లేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని భార్య లత ఆచూకీ కోసం వెళ్ళింది . దీంతో మల్లేశం మృతదేహం బావిలో కనిపించడంతోచూసి ఘోల్లుమంది. కుటుంబాన్ని పోషించే మాకు దిక్కెవరు అంటూ రోదించింది.
మృతుడికి కుమార్తె మానస (15), కుమారుడు లక్ష్మణ్ (13) ఉన్నారు. తండ్రి గడ్డి కోయడానికి వెళ్లి మరణించడంతో వారు కన్నీరు మున్నీరైనారు. సంఘటన స్థలానికి ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ చేరుకొని మల్లేశం మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ పంపించి మృతుడు మల్లేశం భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.