కమాన్ చౌరస్తా, మార్చి 18 : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల్లో (Inter exms)భాగంగా నలుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్టు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలలో భాగంగా రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో మొత్తం 15,965 మంది విద్యార్థులకు 15,563 మంది విద్యార్థులు హాజరుకాగా 402 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ఈ క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సెట్టింగ్ స్క్వాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో పరీక్షకు హాజరైన ఒకరు, ఆల్ఫోర్స్ వావిలాలపల్లి కళాశాలలో పరీక్షకు హాజరైన ముగ్గురు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడినట్లు ఆయన వివరించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.