ఎయిడెడ్ ఉపాధ్యాయుల వేతన స్థిరీకరణలో విద్యాశాఖ భారీ అక్రమాలకు తెరలేపింది. నిబంధనలకు విరుద్ధంగా ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఫైలును సిద్ధం చేసింది. కొంత మంది అధికారులు భారీ మొత్తంలో ముడుపులు మాట్లాడుకున్నట్టు తెలుస్తుండగా, 3 కోట్ల నుంచి 4కోట్లు సర్కారు ఖజానాకు కన్నం పడే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ పాపంలో జిల్లా విద్యాశాఖలో పనిచేసే ఓ కీలక అధికారి చక్రం తిప్పుతుండగా,ఈ తతంగాన్ని వ్యతిరేకించిన ఓ మండల విద్యాధికారిని ఏకంగా పక్కకు తప్పించారు.
వాస్తవాలను దాచి పెట్టి, సాక్షాత్తూ కలెక్టర్‌కే తప్పుడు సమాచారమిచ్చి సదరు విద్యాధికారిని ఆ స్థానం నుంచి తప్పించిన ఆ అధికారులు.. ఇప్పుడు తమ ప్లాన్‌ను యథావిధిగా అమలు చేసేందుకు అన్ని అస్ర్తాలు సిద్ధం చేశారు. పూర్తి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అవినీతి బాగోతంలో జిల్లా విద్యశాఖలో పనిచేసే కొంత మంది అధికారులతోపాటు గత జిల్లా విద్యాధికారి పాత్ర ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సదరు ఫైల్‌ను కలెక్టర్ తక్షణమే స్వాధీనం చేసుకుంటే వాస్తవాలు బయటికి వచ్చే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వం వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని గతంలో పలు విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయి. నిబంధనల ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరైన తర్వాత మాత్రమే వేతన స్థిరీకరణ చేసి.. ఇంక్రిమెంట్లను అమలు చేయాల్సి ఉంటుంది.
ప్రధానంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరైన తేదీ నుంచి సదరు ఉపాధ్యాయుల సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, చాలా ప్రైవేట్ విద్యాసంస్థలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరైనప్పటి నుంచి అన్ ఎయిడెడ్‌గా ఉన్న సమయంలో పనిచేసిన కాలాన్ని సైతం సర్వీస్ కింద పరిగణించి.. వారికి వేతన స్థిరీకరణ చేశారు. అప్పట్లో ఈ అక్రమాలు బహిర్గతం కావడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో అప్పటి ప్రభుత్వం 37/2005 పేరిట ఒక యాక్టును అమల్లోకి తెచ్చింది.
ఎవరి ఇష్టానుసారం వాళ్ల వేతన స్థిరీకరణ చేయరాదని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరైన తర్వాత మాత్రమే సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోవాలని, అక్కడి నుంచే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, అన్ ఎయిడెడ్ కాలంలో పనిచేసిన సర్వీసు అందులోకి వర్తించదని సదరు చట్టంలో స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ కొంత మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లగా, ఆ మేరకు కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. అన్ ఎయిడెడ్ సర్వీసును తీసి వేసి.. యాంత్రిక పదోన్నతి స్కేల్స్ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా, రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
రూ. కోట్లకు ఎసరు?
స్పష్టమైన ఆదేశాలున్నా నిబంధనలకు విరుద్ధంగా కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అక్రమాలకు తెరలేపింది. అన్ ఎయిడెడ్ సర్వీస్‌నే పరిగణలోకి తీసుకొని అక్కడి నుంచి అంటే.. దాదాపు 2005 నుంచి నేటి వరకు వచ్చిన పీఆర్సీలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని, వాటి ప్రకారం వేతన స్థిరీకరణచేసి బిల్లుల చెల్లింపునకు ఫైల్ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీని వల్ల ఒక్కో ఎయిడెడ్ సిబ్బందికి దాదాపు 35లక్షల నుంచి 40లక్షల అదనపు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తున్నది.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈ తరహాలో 16 నుంచి18 మంది సిబ్బందికి నిబనంధనలకు విరుద్ధంగా వేతన స్థిరీకరణ చేసి, డబ్బుల చెల్లింపునకు పూర్తి స్థాయిలో ఫైల్ సిద్ధం చేశారు. అందులో జిల్లా విద్యాశాఖను గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్న ఓ అధికారి, ఓ సెక్టోరల్ ఆఫీసర్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా జరిగే బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక్కొక్కరితో 7లక్షల నుంచి 8లక్షల ముడుపులు మాట్లాడుకున్నట్టు సమాచారం.
చక్రం తిప్పిన అధికారులు?
నిజానికి బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఫైలు ఓ మండల విద్యాధికారి వద్దకు వెళ్లగా.. ఆయన దానిపై సంతకం చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తున్నది. కొంత మంది అధికారులు ఒత్తిడి తెచ్చినా ఆయన ససేమిరా అన్నట్టు సమాచారం. అయితే ఆ అధికారి ఉంటే ఫైల్ ముందుకెళ్లదని భావించిన జిల్లా విద్యాశాఖలోని కొంత మంది అధికారులు.. సదరు విద్యాధికారిని ఆ సీట్ నుంచి తప్పించడానికి కలెక్టర్‌కే తప్పడు సమాచారం ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది.
సదరు నివేదిక ఆధారంగా ఆ విద్యాధికారిని సీట్ నుంచి తప్పిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో అక్రమార్కులు మరింత చెలరేగిపోతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ స్థానంలో తాము చెప్పినట్టు వినే ఒక మండల విద్యాధికారిని కూర్చొబెట్టేందుకు విద్యాశాఖలో చక్రం తిప్పుతున్న అధికారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. ఒకటి రెండు రోజుల్లో సదరు ఎంఈవో రాగానే తాము అనుకున్న ఫైలుపై సంతకం చేయించుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఒక పథకం ప్రకారం జరుగుతున్న ఈ తతంగం వల్ల తప్పును ఎత్తిచూపిన ఓ అధికారి బలయ్యారన్న చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. ఈ వ్యవహారంలో పాత జిల్లా విద్యాధికారి పాత్ర సైతం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉండగానే ఈ పని పూర్తి చేయాలని భావించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల వేతన స్థిరీకరణ ఫైల్‌ను ముందుగా కలెక్టర్ తెప్పించుకోవాలన్న డిమాండ్ వస్తున్నది. సదరు ఫైలును నిశితంగా పరిశీలిస్తే కొంత మంది అధికారులు ఎంతటి అక్రమాలకు ఒడిగట్టారో తెలుస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేసినా సదరు అధికారులు ఫైల్‌ను మార్చి రాయడానికి ఆస్కారం ఉంటుందని, తద్వారా అక్రమాలకు బాధ్యులైన అధికారులు తప్పించుకునే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.