కరీంనగర్ ముకరంపుర, మే 25: కొనుగోళ్లలో జాప్యంపై మక్క రైతులు భగ్గుమన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్కు మక్కలు తెచ్చి ఇరవై రోజులుగా ఎండలో నిరీక్షిస్తున్నా కొనడం లేదంటూ ఆగ్రహించారు. ఈ మేరకు సోమవారం ఉదయం 7.30గంటలకు మూకుమ్మడిగా మార్కెట్ కమిటీ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్నారు. గేటును మూసివేసి, ఉదయం 11.30 గంటల వరకు అక్కడే బైఠాయించారు. ప్రభుత్వంతోపాటు అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. మార్కెట్లో మార్క్ఫెడ్ తరపున డీసీఎంఎస్ చేపడుతున్న కొనుగోళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో మక్కల కోనుగోళ్లపై పర్యవేక్షణ లేక అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ఇరువై రోజులుగా ఇల్లు, పిల్లలను వదిలి మక్క కుప్పల వెంట తిరుగుతున్నా కొనుగోలు చేసే దిక్కే లేదని మండిపడ్డారు.

ప్రస్తుతం మార్కెట్లో వేలాది క్వింటాళ్ల మక్కలు ఉన్నాయని, తామే సంచులు కొని మక్కలు నింపినా వెంటనే తూకం వేయడం లేదని వాపోయారు. లారీలు లేవని లోడింగ్ చేయకపోవడంతో కుప్పల దగ్గరే తాము కాపలా ఉంటూ ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తగినంత మంది హమాలీలు లేరని, వారి సంఖ్యను పెంచి లోడింగ్, తూకం వేగంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. తూకం వేసిన బస్తాలను లారీల్లో లోడింగ్ అన్లోడింగ్ చేసే చార్జీలు సైతం తమ నుంచే వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం యార్డులో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే దిక్కేలేదన్నారు.
నాలుగు గంటలపాటు ఆందోళన చేయడంతో పండ్ల మార్కెట్కు వచ్చే వ్యాపారులు, కొనుగోలు దారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతుల వాహనాలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. దీంతో కరీంనగర్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి షాబుద్దీన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి హమీద్ అక్కడకు చేరుకొని, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వినకుండా.. సకాలంలో తూకం వేయాలని, బస్తాలను గోదాములకు తరలించాలని, అందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి మార్కెట్ కార్యదర్శి హమాలీ ప్రతినిధులతో చర్చించారు. హమాలీల సంఖ్యను పెంచి తూకం, లోడింగ్ వెంట వెంటనే చేపట్టేలా చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
మార్కెట్ల రైతుకు అన్ని సమస్యలే ఉన్నయి. మక్కలు ఇక్కడికి తెచ్చి 25 రోజులు అయితంది. ఒక్క సంచికి రూ. 23 ఖరీదుతోటి నేనే కొనుకున్న. సంచుల కుట్టుకోసం సుతిలి కూడా కొనుకచ్చుకున్న. సంచుల మక్కలు కూడా మేమే ఎత్తుకున్నం. అయినా ఇంకా కాంటా కాలేదు. మక్క రైతులకు ఎక్కడా జాగ లేదు. ఎండల తాగడానికి నీళ్లు సక్కగ లేవ్వు. హమాలీలు లేకనే కాంటా, లోడింగ్ ఆగుతున్నది. మార్కెట్ల మక్కల కుప్పల దగ్గర లైటింగ్, సీసీ కెమెరాలు సరిగా లేవు. మక్కల చుట్టే తిరుగుతున్న. ఇంకా వడ్లు, మామిడి, పసుపు ఎక్కడిదక్కడనే ఉంది. ఒక్క బస్తాకు 51కిలోలకు బదులు 51కిలోల 700గ్రాముల వరకు జోకుతున్నరు.
– బుచ్చిరెడ్డి, చర్లబుత్కూర్
కరీంనగర్ మార్కెట్ల హమాలీల ఇబ్బంది చాలా ఉన్నది. కొనుగోళ్లు సరిగా జరగకనే అవస్థ పడుతున్నం. మక్కలు అమ్మేందుకు రైతులు రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. కొనుగోళ్లలో ఇబ్బందితో ఈ నెల 15 న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మార్కెట్కు వచ్చిండు. అప్పుడు కొంత కొనుగోలు చేసిన్రు. తర్వాత కొనుగోళ్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక్కడ ఎవరూ పట్టించుకునే దిక్కు లేదు. హమాలీల సంఖ్యను పెంచి తూకం, లోడింగ్ వెంట వెంటనే పూర్తి చేయాలి. రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలే.
– మంద రాజమల్లయ్య, గోపాల్పూర్