కార్పొరేషన్, ఏప్రిల్ 15: మహనీయులను గౌరవించుకునే సంస్కృతి తెలంగాణ ప్రభుత్వానిదని, గాంధీ చూపిన శాంతియుత మార్గంలో తెలంగాణను సాధించుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం రాత్రి నగరంలోని కార్ఖానాగడ్డలోని గాంధీ చౌక్‌లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 50 లక్షలతో ఏర్పాటు చేసిన 9 ఫీట్ల మౌన ముద్ర గాంధీ విగ్రహం, సుందరీకరించిన ఐలాండ్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మేయర్ వై సునీల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గాంధీ చూపించిన అహింసా మార్గంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. కొన్ని పార్టీలు మాత్రం గాంధీని మరిచి ఆయనను చంపిన గాడ్సేను గౌరవిస్తున్నాయని దుయ్యబట్టారు.
నాడు దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన మహనీయులను గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనని చెప్పారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు పాలనలోనే మహనీయులకు గౌరవం దక్కుతున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. ఈ రోజు తెలంగాణ అన్నిరంగాల్లో ముందున్నదని, అభివృద్ధిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. కరీంనగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, ఈ ఎనిమిదేండ్లలో పెద్ద ఎత్తున చేపట్టిన పనులతో నగర రూపురేఖలే మారిపోయాయన్నారు.
అనంతరం బాపూరావు రచించిన గాంధీ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను సన్మానించారు. ఇక్కడ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీఆర్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, నక్క పద్మ, మెండి శ్రీలత, ఎడ్ల సరిత, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్, వైశ్య సంఘాల నాయకులు, గాంధీ ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు.
మతోన్మాదులను దగ్గరికి రానివ్వద్దు
దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొందరు మతం పేరిట చిచ్చురగల్చడంతో నాడు వేలాది మంది దారుణాలకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లోనే మహాత్మాగాంధీ కలకత్తాలో మౌన దీక్షలో సత్యాగ్రహం చేశారు. అందుకే మౌన ముద్రలో ఉన్న విగ్రహానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి కొనసాగాలంటే అలాంటి మతోన్మాదులను దగ్గరికి రానివ్వద్దు. ప్రశాంత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ శాంతియుత మార్గంలో నడుచుకోవాలి. సమైక్య పాలనలో హైదరాబాద్‌లో కర్ఫ్యూలు ఉండడం వల్ల అభివృద్ధికి అడ్డంకి ఏర్పడింది. రాష్ట్రంలో శాంతి వాతావరణం ఉండడం వల్లే అభివృద్ధి పరుగులు పెడుతున్నది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనునిత్యం నగరాభివృద్ధి కోసం తపిస్తున్నారు. మా వంతుగా నగరాభివృద్ధికి సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నగరానికి ట్రిపుల్ ఐటీ తేవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. అయితే దురదృష్టవశాత్తు అది రాలేదు. కానీ, వచ్చే దాకా వదిలి పెట్టే ప్రసక్తే లేదు. పోరాడుతూనే ఉంటాం.
– బోయినపల్లి వినోద్‌కుమార్,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
500 మంది విద్యార్థులతో రాట్నం ప్రదర్శన
గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన గాంధీ ఫౌండేషన్ నేతృత్వంలో అల్ఫోర్స్ స్కూల్ విద్యార్థులు గాంధీ వేషధారణలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా రాట్నం వడికి ఖాదీ వస్ర్తాలకు ఉన్న ప్రాముఖ్యతను వివరించగా, ఈ ప్రదర్శన ప్రజల్ని ఆకట్టుకున్నది. అలాగే నగరంలోని ప్రకాశం గంజ్ నుంచి గాంధీ చౌక్ దాకా భారీ ర్యాలీ తీశారు. అనంతరం గాంధీచౌక్‌లో గోగుల ప్రసాద్, సంగెం రాధాకృష్ణ ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.