Mahammai Devi temple | సుల్తానాబాద్ రూరల్,ఏప్రిల్ 07: ఈనెల 8 నుంచి 12 వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు మహమ్మాయిదేవి ఆలయం ముస్తాబైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని రాజీవ్ రహదారికి అతి సమీపంలో హుస్సేమియా వాగు తీరాన వెలసిన మహమ్మాయిదేవి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరిపేందుకు ఆలయ బ్రహ్మోత్సవ నిర్వాహకులు దేవరకొండ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
మహామ్మాయిదేవి స్వయంభువుగా వెలిసిన దేవాలయాల్లో భారతదేశంలో ఉన్న పురాతన దేవాలయంలో ఇది రెండోది. ఒకటి ముంబై పట్టణంలో, రెండవది చిన్నకల్వల గ్రామంలో ఉంది. ప్రతీ సంవత్సరం బ్రహ్మోత్సవాలు కమణీయంగా, కన్నుల పండుగగా జరిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేస్తన్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ ఐదు రోజుల పాటు ప్రతినిత్యం పురోహితులు, వేద పండితుల మంత్రోచ్ఛరణములతో ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతీ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఉమామహేశ్వర స్వాముల కళ్యాణం, హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొటున్నారు. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లతో పాటు తదితర ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని దేవాలయ వ్యవస్థాపకులు, ఆలయ నిర్వాహకులు తెలిపారు.