కరీంనగర్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/ తెలంగాణ చౌక్) : ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం పురుషులకు కష్టాలు తెచ్చిపెట్టిందా..? ప్రయాణం కోసం వారు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తున్నదా..? ఫలితంగానే ఆర్టీసీలో ప్రయాణించే మగవాళ్ల రేషియో తగ్గిందా..? గతంతో పోలిస్తే సీన్ రివర్స్ అయిందా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. గడిచిన ఎనిమిది నెలల్లో కరీంనగర్ రీజియన్లో ప్రయాణించిన వారి సంఖ్యే దీనికి నిదర్శనం! నిజానికి మహాలక్ష్మీ పథకం రాక ముందు.. బస్సుల్లో మహిళలకన్నా పురుషుల సంఖ్యే అధికంగా ఉండేది. అప్పటి రేషియో ప్రకారం చూస్తే దాదాపు 65 శాతం పురుషులు, 35 శాతం మహిళలుండే వారు. కానీ, ఫ్రీ ప్రయాణంతో మహిళల సంఖ్య రెట్టింపుకాగా, పురుషుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. ఎనిమిది నెలల కాలంలో రీజియన్లోని 11 డిపోల పరిధిలో 9.46 కోట్ల మంది ప్రయాణిస్తే.. అందులో 67.11 శాతం మంది మహిళలు, కేవలం 32.88 శాతం మంది పురుషులుండడం గమనార్హం!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 9 నుంచి ఇది అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం ఎక్స్ప్రెస్, పల్లె వెలుగుకు పూర్తి స్థాయిలో వర్తింప జేస్తున్నది. ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించే మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. కండక్టర్లు జీరో టికెట్ ఇస్తుండగా, జీరో టికెట్కు సంబంధించిన డబ్బులను ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుంది. ఆర్టీసీ గణాంకాల ప్రకారం చూస్తే.. ఉచిత పథకాన్ని మహిళలు బాగా వినియోగించుకుంటుండగా, గతంతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య దాదాపు రెట్టింపైంది. మహాలక్ష్మీ పథకం అమల్లోకి రాక ముందు రీజియన్ పరిధిలో రోజుకు 2.21 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4.15 లక్షలకు చేరింది. పండుగలు, తీర్థయాత్రలు, జాతరల సమయంలో ఈ సంఖ్య సుమారు ఐదు లక్షలు దాటే అవకాశమున్నది.
పెరిగిన రేషియో
ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లోని 11 డిపోల పరిధిలో మొత్తం 875 బస్సులు నడుస్తున్నాయి. అందులో పల్లెవెలుగు 327, 229 ఎక్స్ప్రెస్లు ఉండగా, మిగిలినవి ఇతర బస్సులున్నాయి. ఉమ్మడి జిల్లాలో చూస్తే గత డిసెంబర్ నుంచి జూలై చివరి వరకు అంటే దాదాపు ఎనిమిది కాలంలో ఆర్టీసీలో ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య 9.46 కోట్లు! అందులో మహిళల సంఖ్య 6.35 కోట్లు కాగా, పురుషుల సంఖ్య 3.11 కోట్లుగా ఉన్నది. రేషియో ప్రకారం చూస్తే మహిళల శాతం 67.11 కాగా, పురుషుల శాతం 32.88గా ఉన్నది. నిజానికి గతంలో మహిళలకన్నా.. పురుషులే అధికంగా ప్రయాణించే వారు. కానీ, ప్రస్తుతం సీన్రివర్స్ అయింది. అంతేకాదు, పథకానికి ముందు రీజియన్లో 68.13 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం అది 85.33కు పెరిగింది. అంటే దాదాపు 17.2 శాతం పెరిగింది.
బస్సుల సంఖ్య పెరగాలి
రీజియన్ పరిధిలో గతంలో రోజుకు 2.21 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 4.15 లక్షలకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పథకం అమల్లోకి రాక ముందు ఒక్కో బస్సులో (అన్ని ట్రిప్పులు కలిపి) సుమారు 252 మంది వరకు ప్రయాణించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 415కు పెరిగింది. అంటే సగటున రోజుకు ఒక బస్సుల్లో అదనంగా 222 మంది ప్రయాణిస్తున్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని చూస్తే.. రీజియన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 875 ఆర్టీసీ బస్సులకు అదనంగా మరో 300 బస్సులైనా పెరగాల్సిన అవసరం ఉన్నది. కానీ, ఇప్పట్లో కొత్త బస్సులు వచ్చే అవకాశాలు తక్కువ. అద్దె బస్సులను కూడా తీసుకోవచ్చు. కానీ, ఖర్చుతో కూడుకున్నదని, ప్రభుత్వం ఉన్న బస్సులతోనే సరిపెడుతున్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఫలితంగా ఓవర్లోడ్తో బస్సులు నడపాల్సి వస్తున్నదని, అందులోనూ 60 శాతం పాత బస్సులే ఉండడం వల్ల ఆ లోడ్ మోయడం, అందుకు అనుగుణంగా బస్సును నడపడం ఇబ్బంది అవుతున్నదని డ్రైవర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో కొత్త బస్సుల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరమున్నది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ, ఇదే సమయంలో డబ్బులు పెట్టి ప్రయాణించే మగవాళ్ల సమస్యను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్న డిమాండ్ వస్తున్నది. మగవాళ్ల సంఖ్య పెరిగినప్పుడే.. ప్రభుత్వం ఉచితానికి సంబంధించి డబ్బులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా మగవాళ్ల చార్జీలతోనైనా ఆర్టీసీ మనుగడ సాధించడానికి మార్గం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు కార్మికుల నుంచే వ్యక్తమవుతున్నాయి.
ఆసక్తి చూపని పురుషులు
పెరిగిన రేషియోకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాలి. అందులో మాత్రం పెద్దగా తేడా లేదు. దీంతో బస్సుల్లో సీట్లు దొరకడం గగనంగా మారింది. ప్రతి బస్సులోనూ మహిళలకే సీట్లు సరిపోవడం లేదు. దీంతో చాలా మంది పురుషులు తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎక్కువ శాతం మంది తమ ప్రయాణాలకు ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నారు. అలాగే, మరికొంత మంది ఇతర మార్గాల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు.
ప్రయాణికుల రేషియోకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగక పోవడం, బస్సుల్లో సీట్లు దొరక్కపోవడం.. సమయానికి అనుగుణంగా బస్సులు లేకపోవడం, చాలా ప్రాంతాలకు ట్రిప్పులు తగ్గడం, వంటి పరిస్థితుల నేపథ్యంలో పురుషులు ఆర్టీసీలో ప్రయాణించడానికి పెద్దగా ఆసక్తి చూపకుండా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో ప్రయాణించే మహిళల సంఖ్య రెట్టింపు కాగా.. మగవాళ్లకు కష్టాలు తెచ్చిపెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇటు ఇటీవలి కాలంలో ఓవర్లోడ్ వల్ల తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ కార్మికులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఇరువై రోజుల క్రితం ఓ డ్రైవర్.. ఓవర్లోడ్తో బస్సు నడుపలేక హుజూరాబాద్ వద్ద బస్సు ఆపేసి, నిరసన తెలిపిన విషయం తెలిసిందే.