Magic Raja | కోల్ సిటీ, జూన్ 17: గోదావరిఖనికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలలో మేజిక్ రాజా స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ఈమేరకు నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం రాజాను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
పలువురు మాట్లాడుతూ పలు కళలలో ప్రావీణ్యం సంపాదించి జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి పురస్కారాలకు సుపరిచితుడిగా గౌరవం తెచ్చుకున్నాడని కొనియాడారు. కవిగా, రచయితగా, వ్యాఖ్యాత, ఇంద్రజాలికుడుగా, మూకాభినయ కళాకారుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా తెలుగు రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పుట్టిన గుడ్డకు కూడా కీర్తి తీసుకవచ్చాడన్నారు.
కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళా సంఘాల ప్రతినిధులు చంద్రపాల్, దేవి లక్ష్మీనర్సయ్య, వేముల అశోక్, మేజిక్ హరి, కే,స్వామి, దయా నర్సింగ్, కాసిపాక రాజమౌళి, విజయ్ కుమార్, రాంశంకర్, సాంబయ్య, రాధాకృష్ణ, కృష్ణ, అంజయ్య, సతీశ్ కుమార్, పెద్దులు, మొండి, నాగుల శ్రీనివాస్ తోపాటు అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.