పెగడపల్లి, నవంబర్ 18: ‘తమది గొప్ప పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని ఏండ్ల కొద్ది పాలించి, అధ్వానం పట్టించింది. చీకటి బతుకులు చేసింది. ఒక్క అభివృద్ధి చేయలే. ప్రజలకు సమస్యలు తప్ప, సంతోషం లేకుండా చేసింది. ఇప్పుడు మళ్లీ గ్యారెంటీలంటూ అసత్య ప్రచారం చేస్తూ జనాలను మభ్యపెడుతున్నది. నేనొక్కటే చెబుతున్నా.. కాంగ్రెస్ చెప్పే మాటలను నమ్మి ఓటేశారో..? జీవితాలు ఆగమవుతయి. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అవుతుంది” అని ధర్మపురి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందని, మళ్లీ చీకటి కష్టాలు మొదలవుతాయని, పథకాలు బందైపోతాయని చెప్పారు. పెగడపల్లి మండలం మద్దులపల్లి, బతికపల్లి గ్రామాల్లో శనివారం ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేశారు. ఆయాచోట్ల మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. బొట్టుపెట్టి మరీ ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. తన జీవితం ప్రజా సేవకే అంకితమని, ప్రజల కోసమే అనునిత్యం 18 గంటల పాటు పని చేస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. రైతులకు 3 గంటల కరంటే చాలని రేవంత్‌రెడ్డి బాహాటంగానే చెబుతున్నారని, సాగుకు మూడు గంటలు చాలా..? అని ప్రశ్నించారు. ఇంకా 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని సాగు నీరు పారించుకోవాలని అంటున్నాడని, ఇది సాధ్యం అవుతుందా..? అన్నారు. ఇటువంటి కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, మూడు గంటల కరంటే దిక్కవుతుందని, పథకాలు బందైపోతాయన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే.. అభివృద్ధి, సంక్షేమం జరుగాలంటే.. బీఆర్ఎస్కు ఓటు వేయాలని సూచించారు.
స్వరాష్ట్రంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, ప్రజలకు న్యాయం జరుగుతున్నదని చెప్పారు. ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న జీవితాన్ని బాగు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తన పదవీ కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో చేశానని, ప్రజలు మళ్లీ ఆశీర్వదించి గెలిపించాలని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత రమణారావు, జడ్పీటీసీ రాజేందర్రావు, ఎంపీపీ శోభా-సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ లోక నిర్మల, సర్పంచ్ అనూష-మల్లారెడ్డి, ఎంపీటీసీ స్వాతి-తిరుపతిరెడ్డి, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లారెడ్డి, వెంకన్న, మండల అడ్‌హక్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆనందం, కరుణాకర్‌రావు, యూత్ అధ్యక్షుడు సంతోష్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ నాయకులు మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, రఘునందన్, తిరుపతి, సత్యనారాయణరెడ్డి, జైపాల్‌రెడ్డి, షకీల్, వెంకటేశం, మనోహర్, గంగాధర్, రాజయ్య, రాజేశ్వర్‌రెడ్డి, కిషన్, రాయమల్లు, శ్రీనివాస్, తిరుపతి, తదితరులు ఉన్నారు.