జమ్మికుంట, అక్టోబర్ 3 : పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి చేసింది. అందులో మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్-మీనా దంపతుల మూడేళ్ల కూతురు అక్షర ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్నది.
ఇదే సమయంలో కుక్క సదరు చిన్నారిపై దాడి చేసింది. పాప అరుపులకు బంధువులు కుక్కను తరిమికొట్టారు. అప్పటికే అక్షరకు ముఖం, పెదవులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అదే కుక్క గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ.. స్వరూప, వెంకటస్వామి, గట్టమ్మ, రితిక్(బాబు)తో పాటు మరో వృద్ధురాలిని కరిచింది. క్షతగాత్రులందరూ దవాఖానకు తరలివచ్చారు. వైద్యసిబ్బంది బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. కాగా, చిన్నారి అక్షరకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తీసుకెళ్లారు.
ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కాగా, కుక్క కోసం గ్రామస్తులు గాలించగా అది దొరకలేదు. అయితే, గ్రామంలో కుక్కలు దాడి చేయడం ఇది కొత్తకాదని, గతంలోనూ పలువురిపై దాడి చేశాయని గ్రామస్తులు తెలిపారు. పిచ్చి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని అధికారులను కోరారు. కుక్కల బెడదపై మండలాధికారులకు సమాచారం ఇచ్చానని, చర్యలు చేపడతామని కార్యదర్శి రామారావు చెప్పుకొచ్చారు.