కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నయా దందా వెలుగుచూస్తున్నది. సదరం సర్టిఫికెట్ల పేరిట సాగుతున్న దందాను స్వయంగా దవాఖాన సూపరింటెండెంట్ పట్టుకున్న తీరు సంచలనంసృష్టిస్తున్నది. గతంలోనూ సదరం పేరిట డబ్బులు వసూలు చేయ డం, వారిపై చర్యలు తీసుకోవడం తెలిసిందే అయినా.. ఇప్పుడు కొత్త పంథాలో వసూళ్లకు దిగుతుండడం కలకలం రేపుతున్నది.
దివ్యాంగుల దరఖాస్తుల్లో ఉన్న ఫోన్ నంబర్లు తెలుసుకొని నేరుగా ఫోన్లు చేస్తూ.. ‘డబ్బులిస్తే మీకు దివ్యాంగుల సర్టిఫికెట్ ఇప్పిస్తా’మంటూ బేరసారాలకు దిగడం, ఆ తర్వాత అధికారుల పేర్లు చెప్పి పెద్ద మొత్తంలో లాగుతున్నట్టు తెలుస్తున్నది. ఇలానే గంగాధర మండలం గట్టుభూత్కూర్కు చెందిన కొత్తూరి రాజయ్య కూతురుకు ఎంసీహెచ్‌లో ఏజిల్ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసి.. 30 వేలిస్తే మీ నాన్నకు సర్టిఫికెట్ ఇప్పిస్తానని ఆశ చూపాడు. అనుమానం వచ్చిన ఆమె సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో అడ్డంగా దొరికిపోయాడు. సోమవారం సదరం శిబిరం వద్ద ఆమె డబ్బులు ఇస్తుండగా.. సూపరింటెండెంట్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం చర్చనీయాంశమైంది.
కరీంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 10 : కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో సదరం సర్టిఫికెట్ల దందా వెలుగు చూసింది. ఒక్క దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం 30 వేలు డిమాండ్ చేసిన ఎంసీహెచ్ ఏజిల్ సెక్యూరిటీ గార్డ్‌ను సోమవారం హాస్పిటల్ సూపరిండెండెంట్ డాక్టర్ వీరారెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం సంచలనం రేపింది. అమాయకులైన దివ్యాంగులను దోచుకుంటున్న తీరు అవినీతిని బయటపెడుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. గంగాధర మండలం గట్టుభూత్కూర్కు చెందిన కొత్తూరి రాజయ్య అనే దివ్యాంగుడు సదరం శిబిరం కోసం జనవరిలో మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు.
సదరం శిబిరాల నిర్వహణకు తేదీలు ఖరారు కావడంతో ఆయన కూతురుకు ఒక ఫోన్ వచ్చింది. మీ నాన్నకు దివ్యాంగుల సర్టిఫికెట్ ఇప్పిస్తానని, అందుకు 30 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమెకు మొదట ఆశ పుట్టింది. కానీ, పెద్ద మొత్తంలో అడగడంతో ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆలోచనలో పడింది. క్యాంపునకు ఒక రోజు ముందు నుంచే రోజుకు నాలుగైదు సార్లు ఫోన్లు చేసి విసిగిస్తుండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఇంతకు ఇతను ఎవరనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘మీ పేరేమిటి సార్’ అని అడిగింది.
తన పేరు సాదిక్ అని చెప్పాడు. చివరికి సదరం శిబిరం సోమవారం ప్రారంభం కావడంతో ఆమె గట్టుభూత్కూర్ నుంచి కరీంనగర్ వచ్చే వరకు అనేక సార్లు ఫోన్లు చేశాడు. కరీంనగర్ దవాఖానకు చేరుకున్న తర్వాత శిబిరం వద్దకు ఎలా వెళ్లాలి? తనను ఎలా కలవాలనే డైరెక్షన్ కూడా ఇచ్చాడు. అప్పటికే అతడిపై అనుమానంతో ఉన్న రాజయ్య కూతురు అతడి గురించి హాస్పిటల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ జరిగిన సంభాషనంతా సూపరిండెండెం ట్ డాక్టర్ వీరారెడ్డికి వినిపించారు.
పట్టుబడిన సెక్యూరిటీ గార్డ్
వాయిస్ రికార్డులు విన్న సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఫోన్లో చెప్పినట్టు సదరం క్యాంపు వద్దకు వచ్చారు. ఫోన్లో మాట్లాడిన సెక్యూరిటీ గార్డ్ సాదిక్ రాజయ్య కూతురుతో క్యాంపు వద్ద మాట్లాడుతుండగా, డైరెక్టుగా పట్టుకున్నారు. సూపరింటెండెంట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. అతను ఫోన్ చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఇదంతా ఎవరు చేయమన్నారని ప్రశ్నించగా, దవాఖానలో పని చేస్తున్న ఒక పీఆర్వో పేరు చెప్పాడు. నిజానికి ఈ దందా గతంలోనూ సాగింది. ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి దవాఖానలో కొంత మందితో సంబంధాలు పెట్టుకుని సదరం సర్టిఫికెట్లకు రేట్లు కట్టి విక్రయించేవాడు.
ఈ విషయాన్ని అప్పట్లో ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు కేసులు నమోదు జైలుకు పంపించారు. ఇదే తరహాలో కింది స్థాయి సిబ్బందిని రంగంలోకి దింపి దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది ఇప్పుడు సదరం సర్టిఫికెట్ల దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. నిజానికి సదరం క్యాంపునకు వచ్చే వాళ్లంతా నిరుపేదలే. వారికి డిజబులిటీని బట్టి దవాఖానలో దివ్యాంగుల సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. కానీ, కొందరు దవాఖాన సిబ్బంది జోక్యం చేసుకోవడంతో అనర్హులకు కూడా సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఆరోపణలు సైతం లేక పోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఎంసీహెచ్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న ఏజిల్ సెక్యూరిటీగార్డ్ సాదిక్‌ను పట్టుకోవడం సంచలనం సృష్టించింది.
ఏమార్చుతున్న మోసగాళ్లు
సదరం శిబిరాల్లో ఇచ్చే దివ్యాంగుల సర్టిఫికెట్లకు ఇప్పుడు బయట బాగా డిమాండ్ ఉన్నది. ఈ సర్టిఫికెట్లను బట్టి ప్రభుత్వం దివ్యాంగ పింఛన్ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు దివ్యాంగులు సదరం శిబిరాలకు మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్లో అప్లయ్ చేసుకుంటున్నారు. వారి డిజబులిటీని బట్టి వైద్యులు ఎంత శాతం ఉన్నదో పేర్కొంటూ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. కానీ, దవాఖానలో ఒక టీంగా ఏర్పడిన కింది స్థాయి సిబ్బంది జోక్యం చేసుకుంటే మాత్రం వాళ్లు ఎంత రాయమంటే అంతే వైద్యులు రాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే కొంత మంది సెక్యూరిటీ గార్డులు, వార్డుబాయ్‌లను రంగంలోకి దింపి దివ్యాంగులతో బేరసారాలకు దింపుతున్నారని తెలుస్తున్నది. ఒక్కో సర్టిఫికెట్‌కు 30 వేలు డిమాండ్ చేస్తుంటే నిరుపేదలు దిక్కుతోచని పరిస్థితిలో పడుతున్నారు. కొత్తూరు రాజయ్య విషయంలో కూడా ఇదే జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన రాజయ్యకు అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా దవాఖానల చుట్టూ తిరుగుతున్నాడు. ఆరోగ్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు కూడా చేశాడు. అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడ లేదు. ప్రస్తుతం మంచానికే పరిమితమైన రాజయ్యకు దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన రాజయ్య కూతురును సెక్యూరిటీగార్డ్ సాదిక్ డబ్బులు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడింది.
‘కొంత తగ్గియ్యండి సార్’ అని బతిమిలాడుకున్నది. 10 వేలు ఇస్తానని ఒప్పుకొన్నా.. సాదిక్ మాత్రం ఇదంతా పెద్ద సార్లకు వెళ్తుందని, తనకు ఐదో పదో ఇస్తారని, తాను 25 వేలు ఇచ్చినా మిగతా 5 వేలు నొక్కేశావా అని మా సార్లు నన్ను అడుగుతారని ఫోన్లో చెప్పడం రికార్డయింది. ఫోన్లో జరిగిన ఈ సంభాషణ వింటుంటే దవాఖానలో పెద్ద ముఠానే ఉన్న అనుమానం కలుగుతున్నది. ఈ విషయంలో లోతైన విచారణ జరిపి, దీని వెనక ఎవరెవరు ఉన్నారో పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి ఉదంతాలకు బ్రేక్ పడుతుందని పలువురు చెబుతున్నారు.
సెక్యూరిటీ గార్డ్‌ను తొలగిస్తున్నాం
సదరం శిబిరం వద్ద డబ్బులు డిమాండ్ చేసిన సెక్యూరిటీ గార్డ్ సాదిక్‌ను ఉద్యోగంలోంచి తొలగిస్తున్నాం. ఇలాంటి వాళ్లు ఇంకా ఎరైనా ఉన్నారా..? అనే కోణంలో విచారణ జరిపిస్తాం. సదరం శిబిరం వద్ద తరచూ సిబ్బంది విధులను మార్చుతున్నాం. అయినా ఇలాంటి దందాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముందు కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంత మంది సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు వస్తే డ్యూటీలు మార్చాం. అయినా వాళ్లు నిత్యం సదరం క్యాంపుల చుట్టే తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్లను ఇప్పటికే కొందరిని గుర్తించాం. వారు తమ విధానాలు మార్చుకోకుంటే కఠినంగా శిక్షించక తప్పదు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
Money