కరీంనగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కలిసి నడుద్దామనుకున్న ఆ ప్రేమికులు ఏడడుగులు వేయకుండానే అనంత లోకాలకు చేరారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరనే అనుమానంతో ఒకే గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్‌కుమార్ (24), ఇదే మండలం భూపాలపట్నానికి చెందిన నాంపెల్లి అలేఖ్య (21) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బావా మరదళ్లు కూడా అయిన వీరు దగ్గరి బంధువులు కూడా. అలేఖ్య తను అరుణ్‌కుమార్‌ను ప్రేమించే విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని అరుణ్‌కుమార్ పెద్దనాన్న కొడుకు, అలేఖ్య సొంత అక్క భర్త అయిన కుమారస్వామి ఈ విషయాన్ని అరుణ్ తల్లిదండ్రులకు దృష్టికి తీసుకెళ్లాడు. తమ కొడుకు ఇంకా ఉద్యోగంలో స్థిరపడ లేదని, తర్వాత ఆలోచిద్దామని అరుణ్ తల్లి దండ్రులు చెప్పడంతో కొంత కాలంగా ఈ విషయంలో స్తబ్ధత ఏర్పడింది.
అయితే, ఇటీవల అలేఖ్యకు వేరే అబ్చాయితో పెళ్లి సంబంధం కుదిర్చారు. అలేఖ్య తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైంది. త్వరలో పెళ్లి కూడా నిశ్చయించడంతో మరింత కుంగి పోయిన అలేఖ్య కాలేజీ నుంచి సర్టిఫికెట్లు తీసుకొని వస్తానని చెప్పి బుధవారం కరీంనగర్‌కు వచ్చింది. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసి ఉంది. వెంటనే కరీంనగర్ వచ్చిన కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా కనిపించ లేదు. అనుమానం వచ్చి అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు. కాగా, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అరుణ్‌కుమార్ ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఇంటి నుంచి కరీంనగర్ చేరుకున్న అలేఖ్య హాస్పిటల్లో ఉన్న అరుణ్‌కుమార్‌ను కలుసుకున్నది. అక్కడి నుంచి అరుణ్‌కుమార్ వావిలాలపల్లిలోని తన అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమోగాని తెల్లవారే సరికి ఒకే గదిలో వేర్వేరు ప్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే రాత్రి కరీంనగర్లో వెతికి ఇంటికి వెళ్లిన అలేఖ్య కుటుంబ సభ్యులు గురువారం ఉదయం అరుణ్‌కుమార్ ఉండే అద్దె ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ వేసి ఉంది. ఎంత పిలిచినా ఫలితం లేకపోయే సరికి వెంటిలేటర్స్ నుంచి చూడగా అరుణ్‌కుమార్, అలేఖ్య విగత జీవులై కనిపించారు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న త్రీ టౌన్ పోలీసులు శవాలను వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న అరుణ్‌కుమార్, అలేఖ్య కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో దవాఖానకు చేరుకున్నారు. ఇరు కుటుంబాల రోదనలు మిన్నంటాయి.. కాగా అలేఖ్య తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ జాన్ రెడ్డి తెలిపారు.
వరుసకు బావా మరదళ్లు కూడా అయిన అరుణ్‌కుమార్, అలేఖ్య గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అలేఖ్య అక్క అరుణ్‌కుమార్ సొంత పెద్ద నాన్న కుమారుడి భార్య, ఈ రకంగా వీరిద్దరూ బంధువులే. అయితే అలేఖ్యను పెళ్లి చేసుకుంటాననే విషయం అరుణ్‌కుమార్ తన తల్లి దండ్రుల ముందు చెప్పలేక పోయినట్లు తెలుస్తున్నది. అలేఖ్య తన తల్లి దండ్రులకు తన ప్రేమ విషయాన్ని కొంత కాలం కిందనే చెప్పగా, అరుణ్‌కుమార్ పెద్ద నాన్న కొడుకు అయిన కుమారస్వామి తన చిన్నాన్న చిన్నమ్మల దృష్టికి తీసుకెళ్లారు. తమ కొడుకు ఉద్యోగంలో స్థిర పడిన తర్వాత పెళ్లి చేస్తామని వారు చెప్పిన నేపథ్యంలో అలేఖ్య, అరుణ్‌కుమార్ దూర దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తున్నది. ఇరు కుటుంబాల మధ్య ఏం జరిగిందో ఏమోగాని అలేఖ్యకు పెళ్లి సంబంధం చూడడం, వేరే అబ్బాయితో వివాహం నిశ్చయంకావడంతో అలేఖ్య, అరుణ్‌కుమార్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తున్నది. ఇద్దరూ ఒకే కులానికి చెంది, వరసైన వారు కూడా కావడంతో కాస్తంత చొరవ తీసుకుంటే ఇద్దరి పెళ్లి జరిగేదని, క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకున్నారని బంధువులు రోదించడం కనిపించింది.