Lifetime Achievement Award | కోల్ సిటీ, జూన్ 7: రెండు దశాబ్ధాల పాటు నిర్విరామంగా సమాజ సేవ చేస్తున్న మాజీ పోలీస్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త దేవి లక్ష్మీనర్సయ్యకు మరోసారి గుర్తింపు లభించింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆయన్ను జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఈనెల 10న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగనున్న వికాస మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి సత్కరిస్తున్నట్లు పేర్కొంది.
లక్ష్మీనర్సయ్య విద్యార్థి దశ నుంచే సేవాభావం కలిగి ఉన్నత చదువులు చదివి కష్టపడి సాధించిన పోలీస్ ఉద్యోగంను సైతం తృణప్రాయంగా వదులుకొని పూర్తి స్థాయిలో సమాజ సేవ బాటను ఎంచుకున్నాడు. జే.సీ.ఐ మోటివేటర్ గా విద్యార్థులు, యువకులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వడం, ఆపదలో ఉన్న వారికి కాదనకుండా రక్తదానం చేస్తూ వస్తున్నాడు.
పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు తన వేతనం నుంచి సగ భాగం నిరుపేదలకే సాయం అందించారు. పేదింటి విద్యార్థుల చదువు కోసం చేయూత ఇచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈనెల 10న జరిగే తమ సంస్థ వేడుకల్లో ప్రముఖుల చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్లు నిర్వాహకులు మధు ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సయ్యను పలు స్వచ్ఛంద సంఘాల బాధ్యులు అభినందించారు.