బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమిటో.. మనం చేస్తున్నదేమిటో ప్రజల ముందు పెడుదాం..
సమష్టిగా పనిచేద్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం..
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారానికి హాజరు
పెద్దపల్లి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ);“తెలంగాణ ఏర్పడక ముందు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించింది.. ఎనిమిదేళ్లుగా బీజేపీ దేశాన్ని ఏలుతున్నది.. వాళ్లు తెలంగాణకు చేసిందేమిటి..? మనం చేస్తున్నది ఏమిటి..? అనే విషయాలను ప్రజల ముందుంచాలి.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూపి ఆ పార్టీల నాయకుల విమర్శలను తిప్పికొట్టాలి.. ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వారు విష ప్రచారం చేస్తున్నారో.. అదే వేదికగా వారి నిజాలను నిగ్గు తేల్చాలి..’ అంటూ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, శాసన మండలి విప్ టీ భానుప్రసాదరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్‌తో కలిసి పట్టణంలో జరిగిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల విపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూనే తెలంగాణ సర్కారు చేపట్టిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు.
సోషల్ మీడియా వేదికగానే కాంగ్రెస్, బీజేపీల అసత్య ప్రచార బండారాన్ని బయటపెట్టి వారి విమర్శలను తిప్పికొట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాక ముందు ఎలా ఉండేదో.. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూపి వారి విమర్శలను తిప్పికొట్టాలన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్‌లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల విపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూనే తెలంగాణ సర్కారు చేపట్టిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు. ‘పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును కడుతాం అంటే మనం వద్దన్నామా..? రైతు బంధు, దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను పెడితే అడ్డుకున్నామా..?’ అని నిలదీశారు. పనిచేయడం చేతకాని కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు.
కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు చేసిందేమిటని ప్రశ్నించారు. దేశంలో ఏ ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపారా..? అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రంలోని కోటీ యాభై లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మన రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కేంద్ర సర్కారు రైతాంగంపై కక్ష గడుతూ కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అత్యధికంగా 70లక్షల మంది సభ్యులను కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అవకాశం వస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ప్రధానిగా నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత అని కొనియాడారు. 13 మండలాలతో కూడిన పెద్దపల్లి జిల్లా సమావేశానికి ఒక్క పిలుపుతో వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారని, ఇదే ఊపు రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఉందన్నారు. టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నాయకత్వంలో సమష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు.
పెద్దపల్లి జిల్లాకేంద్రం ఆదివారం గులాబీమయమైంది. జిల్లా అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 10గంటలకు గోదావరిఖని పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకానితో కలిసి చందర్ బైక్ ర్యాలీగా పెద్దపల్లికి బయలుదేరారు. ఈ సందర్భంగా చందర్ వెంట పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దారి వెంట ఉన్న గ్రామాల్లో చందర్‌కు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వా గతం పలికారు. మంథని నియోజకవర్గ సరిహద్దు గ్రామం కన్నాల వద్ద జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ఆయనకు టీఆర్ఎస్ శ్రేణులు స్వా గతం పలికాయి. పెద్దపల్లి శాంతినగర్ మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి చందర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్సీ టీ. భానుప్రసాదరావు పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ సాయిబాబా టెంపుల్ వద్దకు చేరుకోగా అక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి స్వాగతం పలికారు. అక్కడ క్రేన్ సాయంతో ఒక భారీ గజమాలను చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్లకు అలంకరించారు. అక్కడి నుంచి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూల మాలలు వేశారు. అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ దవాఖాన వద్ద చందర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూ లమాలలు వేశారు. తిరిగి ప్రత్యేక రథంపై చందర్ బృందం బంధంపల్లి స్వరూప గార్డెన్స్‌కు చేరుకున్నది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులు, జిల్లాకేంద్రంలోని వీధులన్నీ ప్రమాణ స్వీకార ఫ్లెక్సీలతో గులాబీమయమయ్యాయి.
కించపరిస్తే ఊరుకోవద్దు..
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. దీన్ని ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా.. విమర్శలకు దిగుతున్నారు. అలాంటి విమర్శలు ఎవరు చేసినా ఊరుకోవద్దు. సామాన్య కార్యకర్తలను ఆదుకొని అక్కున చేర్చుకునే పార్టీ టీఆర్ఎస్. 2001లో ఒక సామాన్య టీఆర్ఎస్ కార్యకర్తగా చేరిన నేను ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించా. నాపై పెట్టిన ఈ గురుతరమైన బాధ్యతను తూచ తప్పకుండా నెరవేరుస్తా. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తా.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.