జగిత్యాల, మే 29 : ప్రభుత్వ విద్యను ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని నాణ్యమైన విద్యను అందించడానికి అందరం కలిసి కృషి చేద్దామని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని పలు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు ఇస్తున్న వృత్యంతర శిక్షణను వినియోగించుకొని బోధన అభ్యసన సామర్ధ్యాలను పెంచుకొని సాంకేతికతను అభివృద్ధి చేసుకొని, నూతన ఒరవడికి అనుగుణంగా విద్యను బోధించడానికి ఆధునిక పద్ధతిలో బోధనోపకరణాలను ఉపయోగించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధించాలని సూచించారు.
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఉపాధ్యాయులు తమవంతుగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను వచ్చేలా చూడాలన్నారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ చేయాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాధికారి కె రాము మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతంగా పాఠశాలల్లో బోధన నడుస్తోందని మరింత మెరుగుపరచుకోవడానికి ఈ ఉపాధ్యాయ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు పూర్తి స్థాయిలో జిల్లాలోని ఉపాధ్యాయులు అందరికీ చక్కని వసతితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ కొమురయ్య కి జిల్లా విద్యాశాఖ తరఫున స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆపరేషన్ సింధూరం విజయవంతమైనందుకు భారత సైన్యానికి మద్దతు అభినందనలు తెలుపుతూ జరిపిన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ రాజేష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాదరావు, అయిల్నేని నరేందర్ రావు, ఒడ్నాల రాజశేఖర్, లింబగిరి స్వామి, మచ్చ శంకర్, వేల్పుల స్వామి, సురేందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.