karimnagar | కమాన్ చౌరస్తా, మే 13 : ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతి సంప్రదాయాలు, మానవ నాగరికత మూలాలను చేరవేయడానికి వారధిగా నిలుస్తున్న గ్రామీణ జానపద ప్రజాకళారూపాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. మానకొండూరు మండలం, మద్దికుంట గ్రామంలో శ్రీశివమారుతి భజన మండలి ఆధ్వర్యంలో జరుగు చిరుతల రామాయణ నాటక ప్రదర్శన కరపత్రాన్ని ఆయన మంగళవారం కరీంనగర్ లో ఆవిష్కరించారు.
మానవ జీవితాన్ని సంస్కరించగల మహా దృశ్యకావ్యం చిరుతల రామాయణమని పేర్కొన్నారు. మహోన్నతమైన మానవ జీవితాన్ని ప్రతిబింబించే కళలు ఎల్లకాలం వర్దిల్లితేనే సమాజంలో మానవత్వం రాజిల్లుతుందని అన్నారు. రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినియంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి అనేక జీవన మూలాలు ముడిపడి ఉన్నాయన్నారు.
ఉత్తమ ధర్మాలను ఆచరిస్తేనే మనిషి మనిషిగా ఎదగగలడని, ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యమైన రామాయణం నేర్పుతుందన్నారు. మద్దికుంట గ్రామ రంగస్థల కళాకారులచే ప్రదర్శించే చిరుతల రామాయణంలో బుధవారం14న భరతుని పాదుకాపట్టాభిషేకం, గురువారం 15న సుగ్రీవ పట్టాభిషేకం, శుక్రవారం16న విభీషణ పట్టాభిషేకం, 17న శ్రీసీతారాముల పట్టాభిషేక మహోత్సవం, ప్రతీరోజు రాత్రి 8 గంటల నుంచి 2 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు.
కవులు, కళాకారులు, కళాభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి, ఈ నాటక ప్రదర్శనను విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో కవులు అన్నవరం దేవేందర్, కందుకూరి అంజయ్య, కూకట్ల తిరుపతి, పెనుకొండ బసవేశ్వర్, జనగాని యుగంధర్ రంగస్థల కళాకారులు గోపగాని నరేందర్, కెక్కర్ల వెంకటేశం, బొంగోని శ్రీనివాస్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.