Leopard trouble | ఎల్లారెడ్డిపేట, జూలై 14: రాగట్లపల్లి శివారులో చిరుత సంచరిస్తుందని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్వో శ్రీహరిప్రసాద్ హెచ్చరించారు. రాగట్లపల్లి శివారులో పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న రైతుకు సోమవారం చిరుత కనిపించి, గాండ్రించింది. దీంతో రైతులు పరుగెత్తి చుట్టుపక్కల రైతులను అప్రమత్తం చేసిన సమాచారంతో ఎఫ్ఆర్వో తోటి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రైతులను అప్రమత్తం చేశారు.
రాగట్లపల్లికి చెందిన రైతు రాయం సురేశ్ పొలం గట్టు వెంట నడుస్తూ మడుల్లో నీల్లను చూస్తున్నాడు. అదే సమయంలో చూసుకోకుండా ముందుకు వెలుతున్న తరుణంలో అతనికి రెండు మీటర్ల దూరంలో చిరుత గాండ్రించడంతో దాన్ని చూసి కంగుతిన్నాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ చోటకు చేరుకునే లోపు చిరుత సమీప వాగులోని తుంగలోకి చొరబడింది. దీంతో తోటి రైతులకు, అటవీశాఖ అధికారులకు సమచారమివ్వడంతో పొలంలో చిరుత కాలి ముద్రలను పరిశీలించారు.
ఇటీవలే బోనాలలో ఉన్న చిరుత రాత్రి వేల రాగట్లపల్లికి చేరుకుని ఉంటుందని రైతులు ఒంటిరిగా ఎవరూ పొలాల్లోకి వెళ్లవద్దని సమూహంగా వెల్లాలని సూచించారు. ఇక్కడ ఎఫ్ఎస్వో సకారాం నాయక్, సిబ్బంది ఉన్నారు.