పాలకుర్తి, ఏప్రిల్9: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంటింటి నుంచీ తరలిరావాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదలాలని జడ్పీ మాజీ చైర్మన్ పుట్టమధూకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను నట్టేట ముంచారని, ఆరు గ్యారెంటీల అమలుపై ఆ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. పాలకుర్తి మండలం కన్నాలలో బుధవారం ఆయన ‘వరంగల్ సభ’ వాల్రైటింగ్ రాయించారు.
అనంతరం కన్నాలలో రాణాపూర్, భామ్లనాయక్తండా, జీడీనగర్, కన్నాల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. వరంగల్ సభకు రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సభలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వివరించి చైతన్యం చేస్తారని చెప్పారు.
అలాగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. నాడు కేసీఆర్ మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. కానీ, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. రాష్ర్టాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాల్సిన అవసరముందని చెప్పారు. అనంతరం శాలపల్లిలోని నూతన దేవాలయంలో ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆడేపుశ్రీనివాస్, ఎంఏ అతిక్, ఖదార్పాషా, రజియాబేగం, సతీశ్, బూర్ల శ్రీహరి, కుదిరే సతీశ్ తదితరులు పాల్గొన్నారు.