రాజన్న సిరిసిల్ల, జూలై 27 (నమస్తే తెలంగాణ) : సమస్యల పరిష్కారం కోసం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాచౌక్ వద్ద మహా ధర్నా చేశారు. సిరిసిల్ల నుంచి నేతన్నలు వందలాదిగా కదిలారు. యూనియన్ నాయకులు మూషం రమేశ్, పంతం రవి, కోడం రమణ, తాటి పాముల దామోదర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో బయలు దేరి వెళ్లారు.
ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, వస్త్ర పరిశ్రమ సంక్షోభం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న 180 కోట్లు, యార్న్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు వెంటనే 15 కోట్ల మీటర్ల వస్త్ర ఆర్డర్లు ఇవ్వాలని, పది హెచ్‌పీల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. వర్కర్ టూ ఓనర్ పథకం పూర్తి చేసి కార్మికులకు ఇవ్వాలని కోరారు. నేతన్న ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.