Foundation stone | కోల్ సిటీ, ఆగస్టు 29: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ మార్పుతో పాటు శంకుస్థాపనల పునరావృతం కొత్త చర్చకు దారితీస్తోంది. ఒకే అభివృద్ధి పనికి రెండు పర్యాయాలు వేర్వేరుగా ఒకే చోట పక్కపక్కనే శంకుస్థాపనలు చేయడంతో ప్రభుత్వం మారితే మాత్రం పునఃప్రారంభంలా? అంటూ.. నగరంలో చర్చించుకుంటున్నారు.
రెండుసార్లు శంకుస్థాపనలు చేయడం ద్వారా ప్రజాధనంతో రాజకీయ ప్రాచుర్యం పొందే ప్రయత్నమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్నవారి పేర్లు శిలాఫలకాలపై ప్రతిష్టించాలనే ఉద్దేశంతో గతంలో జరిగిన ప్రారంభాలను పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ ప్రారంభోత్సవాలు చేయడం ప్రక్కన బెడితే, శిలాఫలకం ప్రారంభించిన కొద్ది సేపటికే అధికారులు వెంట తీసుకవెళ్లడం ఏమిటని ప్రజలు విస్తుపోతున్నారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పాత 27వ డివిజన్ గాంధీనగర్ కాలనీలో గల గోశాల వెనుకాల ఖాళీ స్థలంలో పండ్ల దుకాణాల సామూహిక భవనం నిర్మాణం కోసం శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ కమిషనర్ చేతుల మీదుగా శిలాఫలకం ప్రారంభోత్సవం చేశారు. అప్పటికప్పుడు ఇనుప ప్లేట్ మీద పేర్లు ముద్రించి ప్రారంభించి అది వెంట తీసుకవెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇదే ఖాళీ స్థలం అప్పట్లో సింగరేణి ఆధీనంలో ఉండేది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి శాసన సభ్యులు కోరుకంటి చందర్ ప్రత్యేక చొరవ తీసుకొని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పండ్ల వ్యాపారుల సౌలభ్యం కోసం ఇక్కడ మార్కెట్ నిర్మించాలని ప్రతిపాదించి ఆ స్థలంను తిరిగి మున్సిపల్ కు అప్పగించేలా చర్యలు తీసుకొన్నారు. ఆ నేపథ్యంలో 2023 అక్టోబర్ 5న సీపీడీ నిధుల నుంచి రూ.10 లక్షల అంచనా వ్యయంతో హోల్ సేల్ పండ్ల వ్యాపార భవన నిర్మాణంకు అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శంకుస్థాపన చేశారు.
ఆ క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం అదే ఖాళీ స్థలంలో మళ్లీ పండ్ల మార్కెట్ నిర్మాణం కోసమని అప్పటి ప్రతిపాదనలు మార్పు చేసి వాటికి మరిన్ని నిధులను జోడించి మరోసారి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఒకే పనికి రెండుసార్లు శంకుస్థాపనలు అవసరమా? ప్రజలకంటే శిలాఫలకాలకే అధిక ప్రాధాన్యతా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇదే సర్వే నం.706లో తమ ఆశ్రమంకు స్థలం కేటాయించాలని హైకోర్టు నుంచి జిల్లా అధికారులను ఆదేశాలు ఉన్నా.. అవేమి పట్టించుకోవడం లేదని పోచంపల్లి రాజయ్య వాపోయారు. ఈవిషయంలో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.