కరీంనగర్ విద్యానగర్, అక్టోబర్ 18 : మానవతా ధృక్పథంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిరుద్యోగులపై రాక్షసంగా వ్యవహరిస్తున్నదని, గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీచార్జి దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని, లేనిపక్షంలో సామాన్య కార్యకర్తగా నిరుద్యోగుల వద్దకు వెళ్లి అండగా ఉంటానని స్పష్టం చేశారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారవుతాయని, సమస్య జఠిలం కా కుండా పరిష్కరించాల్సిన బాధ్యత ప్ర భుత్వానిదే సూచించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో శుక్రవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్‌ను నమ్మి లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటే ఇలా గుంజుకొచ్చి మరీ పోలీసులతో కొట్టిస్తారా? నిరుద్యోగులు చేసిన తప్పేందని ప్రశ్నించారు. నిరుద్యోగుల పాలిట శాపంలా మారే జీవో 29ను ఇకనైనా ఉపసంహరించుకోవాలని, గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చే యాలని డిమాండ్ చేశారు. లేనిపక్షం లో కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు అశోక్‌నగర్ వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్ద తు ఇస్తానన్నారు. తనకు నిరుద్యోగుల జీవితాలే ముఖ్యమని, కేంద్ర మంత్రి పదవి సంగతి తరువాత అన్నారు.
గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళ న న్యాయమైందని, ఈ ఆందోళనతో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకంగా మారేలా చేసుకోవద్దని హితవుపలికారు. గ్రూప్-1 అభ్యర్థుల గొడవ, మూసీ ప్రక్షాళన గొడవ ఉధృతమై ప్ర భుత్వం పడిపోవాలని కొందరు కాంగ్రె స్ నేతలే కోరుకుంటున్నారని, సీఎం సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. మూసీపై సీఎం రేవంత్‌రెడ్డి రోజుకోమాట మారు స్తూ గజినీలా మారుతున్నారని ఎద్దేవా చేశారు.
మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి బీజేపీ వ్యతిరేకమన్నారు. మూసీ పేరుతో 11 వేల ఇండ్లను కూల్చడానికి వ్యతిరేకమని, కాంగ్రెస్‌కు చేతనైతే 11 వేల కుటుంబాలకు ఇండ్లు కేటాయించి అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా చేసిన తరువాతే మూసీ ప్రక్షాళనకు పూనుకోవాలని సూచించారు. హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, బాధ్యులను జైలుకు పంపాలన్నారు. సమావేశంలో బీజేపీ నేత చెన్నమనేని వికాస్‌రావు, మాజీ మేయర్ డీ శంకర్, నాయకులు గంటల రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, జితేందర్ పాల్గొన్నారు.