Farmer| హుజూరాబాద్, మే 7 : జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద్దపాపయ్యపల్లి రైతుల వద్ద ప్రభుత్వం భూమిని సేకరించగా ఇందులో మృతి చెందిన రైతు కంకణాల రాజుకుమార్ రెడ్డికి ఆరెకరాల వ్యవసాయభూమి ఉంది.
ఎకరంన్నతో పాటుగా బావి రహదారి నిర్మాణంలో పోయింది. మార్కెట్ విలువ ఎకరానికి రూ.4కోట్లు పలుకుతుండగా ఎకరన్నతో పాటుగా బావికి పరిహారం కింద రాజుకుమార్ రెడ్డికి కేవలం ప్రభుత్వం రూ.43 లక్షలు మాత్రమే అందించింది.. అదేవిధంగా జాతీయరహదారి నిర్మాణంలో భాగంగా ప్లై ఓవర్, వరద కాలువ నిర్మించడంతో మిగతా భూమికి విలువ లేకుండా పోయింది.. దీంతో పాటుగా బావికూడా పోవడంతో వ్యవసాయం చేసుకుందామంటే సాగు నీళ్ల కరువు ఏర్పడింది.
తనకు నష్టం ఎక్కువగా జరుగుతుందని పరిహారం కొంచెం పెంచాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. పలుమార్లు కలిసినా అధికారులు కనికరించలేదని తోటి రైతుల దగ్గర వాపోయేవాడు. రూ.6కోట్ల భూమికి పొంతన లేకుండా రూ.43 లక్షలు పరిహారం ప్రభుత్వం ఇచ్చిందని ఆవేదన చెందేవాడు. పరిహారం విషయంలో తిరిగితిరిగి అలిసిపోయిన రాజుకుమార్ రెడ్డికి బుధవారం గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలోనే అతను మృతిచెందాడు.
దీంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్లైందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాజుకుమార్ రెడ్డి అకాలమరణంతో కుటుంబసభ్యులు విలపించిన తీరు ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. అతడికి భార్య కల్పన, కూతురు శివాని ఉన్నారు.