Lambadi leaders arrested | ధర్మారం, సెప్టెంబర్ 22: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే కుట్రను నిరసిస్తూ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే కార్యక్రమానికి తరలి వెళ్లకుండా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని లంబాడి తండా (బి) కొత్తూరు గ్రామానికి చెందిన పలువురు లంబాడి నాయకులను ధర్మారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచికత్తు కింద విడుదల చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడి సామాజిక వర్గాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని లంబాడీలు ముట్టడించాలని లంబాడి హక్కుల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో ధర్మారం మండలం నుంచి లంబాడీలు హైదరాబాద్ తరలి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లంబాడి తండా (బీ) గ్రామానికి చెందిన అజ్మీర మల్లేశం నాయక్, అజ్మీర తిరుపతి నాయక్, భూక్య రాజు నాయక్, వాంకుడోత్ నరేష్ నాయక్, కొత్తూరు భూక్య రాజేశం నాయక్ ,బానోత్ రాజేష్ నాయక్, భూక్య శ్రీనివాస్ నాయక్, గుగులోత్ అంజి నాయక్, లాల్ సింగ్ నాయక్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సాయంత్రం వ్యక్తిగత పూచికత్తు కింద వారిని పోలీసులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడి సామాజిక వర్గాన్ని ఆ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్రప్రభుత్వం కుట్ర చేయడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికీ తమ సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని వారన్నారు. కానీ నేడు ప్రభుత్వం అకారణంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కుట్ర చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. లంబాడీలపై కుట్ర మానుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు పేర్కొన్నారు.