భారత రాష్ట్ర సమితికి పెట్టని కోటలా ఉన్న వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ ఓటమికి కారణాలు ఏమిటన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలోనే నడుస్తున్నది. టికెట్ వచ్చిన మరుక్షణం నుంచే.. రాజన్న గడ్డపై రాజీలేని పోరు సాగించిన ఆయన, ఎందుకు ఓడారన్న అన్న అనుమానం తలెత్తుతున్నది. అభ్యర్థి కొత్త వ్యక్తే అయినా.. ఆరంభం నుంచీ అన్ని వర్గాలను కలుపుకొని ప్రచారం చేసి, ప్రజల మెప్పు పొందిన చల్మెడ ఓటమి వెనుక అసలు కుట్రలు ఏమిటన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే జరిగిన వెన్నుపోట్ల కారణంగానే ఆయన ఓడిపోయారని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
– కరీంనగర్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 5 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి కంచుకోటలా ఉన్న వేములవాడ నియోజకవర్గంలో విజ్ఞానవంతుడైన చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓటమికి గల కారణాలపై ఆ పార్టీలో చర్చ సాగుతున్నది. నిజానికి ఫలితాలను విశ్లేషిస్తే.. ఇక్కడ కేవలం సెంటిమెంట్ తప్ప కాంగ్రెస్ గాలి పనిచేయలేదు. ఈ సెంటిమెంట్‌ను తట్టుకొని ముందుకు పోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. అలాగే, భారతీయ జనతా పార్టీ తన గెలుపు కోసం కాకుండా కేవలం బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చివరి నిమిషంలో తుల ఉమకు ఇచ్చిన బీఫాంను చెన్నమనేని వికాస్‌కు అందించారన్న ఆరోపణలున్నా యి. వీటిన్నింటినీ అధిగమించి విజయం వైపు నడిచే శక్తి బీఆర్ఎస్కు ఉన్నా.. సొంత పార్టీలోని కొందరు వెన్నుపోటు పొడవడం వల్లే ఓటమి పాలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గం.. బీఆర్ఎస్ గడ్డ
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వేములవాడ శాసనసభా నియోజకవర్గం ఏర్పడింది. ఆనాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్కు పెట్టని కోటగా ఉన్నది. ఈ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికను కలుపుకొని మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నాలుగుసార్లు విజయం సాధించారు. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థిపై 1821 ఓట్లతో విజయం సాధించారు. 2009లో తె లంగాణ రాష్ర్టాన్ని ప్రకటించిన యుపీఏ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం, ఇదే సమయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని నిరసిస్తూ రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో ఉప ఎన్నికలు రాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి, 50వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. తిరిగి 2014 ఎన్నికల్లో 5,268 ఓట్లతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై 28,186 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇలా ప్రతి ఎన్నికలోనూ ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలిచారు. రమేశ్‌బాబుకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పట్టంకట్టారు. అయితే తాజా, ఎన్నికల్లో కోర్టులో ఉన్న ఒక కేసును దృష్టిలో పెట్టుకొని రమేశ్‌బాబుకు టికెట్ ఇవ్వడం లేదని అధినేత కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మంచి వ్య క్తిత్వంతోపాటు విద్యావంతుడైన చల్మెడ లక్ష్మీనరసింహారావుకు అవకాశమిచ్చారు.
విజయావకాశాలున్నా..
మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే వేములవాడ నియోజకవర్గం పరిస్థితి వేరు. నిజానికి గత చరిత్ర చూస్తే.. ఆది నుంచి ఇది పూర్తిగా గులాబీ పార్టీకి అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో వేములవాడ బీఆర్ఎస్కు అడ్డగా పేరు పడింది. ఈ సారి చల్మెడ లక్ష్మీనరసింహారావును పార్టీ రంగంలోకి దింపింది. మంచి విజన్ ఉన్న నాయకుడు కావడంతో అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే సమయంలో రమేశ్‌బాబుకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను స్వయంగా పార్టీ అధినేత కేసీఆరే స్వయంగా విప్పి చెప్పారు. చల్మెడ తన సొంత నియోజకవర్గం కావడంతో చాలా కాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన కళాశాల నుంచి అనేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాదు, చాలా మందికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు ఉచితంగా చేశారు. సొంత గ్రామం మల్కపేటలో కోట్లా ది రూపాయలతో బడి నిర్మించడంతోపాటు గుడిని కూడా కట్టిస్తున్నారు.
అనేక రకాల స్వచ్ఛంద కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ గడ్డపై గులాబీకి ఉన్న బలం, అలాగే చల్మెడ చేసిన సేవలు, ఆయనకున్న విజన్ వంటివి ఎన్నో విజయం చేకూరుస్తాయని అందరూ భావించారు. టికెట్ ప్రకటన వచ్చిన వెంటనే చల్మెడ సైతం అందరినీ కలుపుకొని ముందుకెళ్లారు. తనదైన శైలిలో ప్రచారం సాగించారు. మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబుతోపాటు ఇన్చార్జిగా వ్యవహరించిన బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి ప్రచారం చేశారు. అంతేకాదు, స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ నియోజవర్గంలో పర్యటించి, చల్మెడను గెలిపిస్తే దత్తత తీసుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వేములవాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలోనూ పార్టీ అధినేత కేసీఆర్ సైతం పలు హామీలు ఇచ్చారు. పరిస్థితులను ఏ కోణంలో చూసినా గెలుపు తథ్యం అని అందరూ భావించారు. కానీ, రిజల్ట్ మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది.
వెన్నుపోటే కారణమా..?
ఈ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ కలిపి మొత్తం 1,74,145 ఓట్లు పోలయ్యాయి. అందులో విజయం సాధించిన ఆది శ్రీనివాస్‌కు 71,451 (41.03 శాతం), చల్మెడ లక్ష్మీనరసింహారావుకు 56,870(32.66 శాతం), బీజేపీ అభ్యర్థి వికాస్‌కు 29,710 (17.06 శాతం) ఓట్లు వచ్చాయి. చల్మెడపై 14,581 ఓట్ల మెజార్టీతో ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. నిజానికి ఈ ఓట్లు సాధించడం బీఆర్ఎస్కు పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లోపం ఎక్కడ జరిగిందన్న దానిపైనే ఇప్పుడు చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ అని చెప్పుకుంటూనే.. కొంత మంది నాయకులు సరైన రీతిలో ప్రచారం చేయకపోవడంతోపాటు నెగటివ్ ప్రచారం చేయడం, అలాగే వెన్నంటి ఉన్నట్లే ఉండి.. వెన్నుపోటు పొడవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రచారం చేసే వారిని సైతం కొంత మంది అంతర్గతంగా అడ్డుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. నిజానికి వచ్చిన మెజార్టీని చూస్తే.. కాంగ్రెస్ గాలి ఇక్కడ పెద్దగా లేదు. ఒక్క సెంటిమెంట్ కొంత మేరకు పని చేసిందని చెప్పవచ్చు. ఇక బీజేపీ సైతం చల్మెడను ఓడించడమే లక్ష్యంగా కంకణం కట్టుకొని ప్రచారం చేసిందన్న విమర్శలున్నాయి. అందులో భాగమే తుల ఉమకు ఇచ్చిన బీఫాంను చివరి నిమిషంలో మార్చి వికాస్‌కు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, ప్రతిపక్షాల కుట్రలను, కుతంత్రాలను తట్టుకొని సైతం బీఆర్ఎస్ విజయం దిశగా అడుగులు వేసే సామర్థ్యం ఈ గడ్డపై ఉన్నది. ఇతర పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. అందరూ నిస్వార్థంగా పనిచేసి ఉంటే విజయం సాధించే అవకాశం ఉండేదన్న వాదన ప్రస్తుతం గులాబీ పార్టీలో నడుస్తున్నది. ఒక వైపు బీఆర్ఎస్ బలం.. మరోవైపు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు.. ఇంకోవైపు అభ్యర్థి చల్మెడపై ఎటువంటి ఆరోపణలూ లేకపోవడంతోపాటు విజన్ ఉన్న నాయకుడు కావడం వంటి అంశాలు కలిసి వచ్చేవిగా ఉన్నా.. రిజల్ట్ మాత్రం మరో రకంగా ఉండడం చూస్తే పార్టీలో కొంత మంది వెన్నంటి ఉంటూనే వెన్నుపోటు పొడిచారనే విమర్శలు వినవస్తున్నాయి.