Lakshmi Devipalli Bridge | గంగాధర, జూలై 12: గంగాధర పెగడపల్లి రహదారిపై గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి వద్ద బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. బ్రిడ్జి సైతం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈలోపు ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలు గెలుస్తున్నా ఇప్పటివరకు నూతన బ్రిడ్జిని నిర్మించలేదు. వనా కాలం వచ్చిందంటే చాలు వరదలకు ఈ బ్రిడ్జి నీట మునిగి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో అధికారులు బ్రిడ్జి వద్ద తాత్కాలిక మరమ్మతులు చేయడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలపయంగా మారడంతో అధికారులు మొరం పోయించి తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. అయితే తాత్కాలిక మరమ్మతులు చేయడం కాదని, నూతన బ్రిడ్జిని నిర్మించి సమస్యలు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.