Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 8 : వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాదం నిలువలు నిండుకోవడంతో భక్తులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే సోమవారం లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా మంగళవారం కూడా దాదాపు భక్తుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తప్పనిసరిగా లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు.
అయితే రెండు రోజులుగా భక్తుల తాకిడి అధికంగా ఉండగా ఇందుకు అనుగుణంగా ఆలయ అధికారులు ప్రసాదాలు తయారు చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం సుమారు పదిన్నర గంటల తర్వాత ప్రసాదం విక్రయాలు నిలిచిపోగా మళ్లీ 12:30గంటల తర్వాత అరకొరగా వచ్చిన స్వామివారి ప్రసాదాలను రేషన్ విధానంలో భక్తులకు అందజేశారు. ఈ విషయమే ప్రసాదాల విభాగం అధికారులను వివరణ కోరగా సోమవారం రోజున దాదాపు 45 వేల లడ్డు ప్రసాదం విక్రయాలు జరిగాయని తెలిపారు. మంగళవారం ఉదయం కూడా ఉదయం నుండి 15వేల లడ్డు ప్రసాదాల విక్రయాలు జరిపామని తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో కొంత ఆలస్యమైందని తెలిపారు.
రెండు గంటలుగా ప్రసాదాల కోసం నిలుచున్నాం..: నరేష్, పీర్లపల్లి సిద్దిపేట జిల్లా
భీమేశ్వర స్వామి దర్శనం పూర్తయ్యాక స్వామివారి ప్రసాదాల కోసం వస్తే అయిపోయాయని తెప్పిస్తున్నామని చెప్పారు. రెండు గంటలుగా తరువాత ప్రసాదాలు మళ్లీ విక్రయించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకోనైనా ప్రసాదాలు తయారు చేయాల్సి ఉండేది.