ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లేకపోవడంతో వరంగల్, హైదరాబాద్‌కు రోగులను రెఫర్ చేయాల్సి వస్తోంది. అత్యవసర చికిత్సలు సరైన సమయంలో అందించకపోవడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కాగా, సోమవారం దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం జరగనుండగా, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు అధికారులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో దవాఖానలో మరిన్ని మెరుగైన సదుపాయాల కోసం రోగులు ఎదురు చూస్తున్నారు.
కరీంనగర్ విద్యానగర్, సెప్టెంబర్ 8: కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు గొప్ప పేరుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ దవాఖానకు పొరుగున ఉన్న రాష్ర్టాల ప్రజలు కూడా వచ్చి చికిత్స పొందుతుంటారు. అయితే, ఇక్కడి వైద్య వ్యవస్థను సమర్ధవంతంగా పనిచేయించడంతోపాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ సేవల సదుపాయం లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సదుపాయాలు లేవని వైద్యులు వరంగల్, హైదరాబాద్ ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. సరైన సమయంలో అత్యవసర సేవలు అందక చాలా మంది మార్గంమధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు.
మెడికల్ కళాశాల ఉన్నా..
గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని కొత్తపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ మేరకు ఇటీవలే అనుమతి ఇచ్చారు. ఇందులో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు తీసుకునే ప్రయత్నంలో ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేవలం కొంత మందినే డిప్యూటేషన్‌పై విధులకు తీసుకున్నారు.
అయితే, పూర్తి స్థాయి ఫ్యాకల్టీస్ను తీసుకుని త్వరగా తరగతులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలాగే, వైద్య కళాశాలలో హాస్టల్ వసతులు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే బస్సు ఉండడంతో ట్రాన్స్‌పోర్టు సైతం ఇబ్బందిగా మారింది. మరో బస్సును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్య కళాశాలను వెంటనే పూర్తి చేయాలని, వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఎంఆర్ఐ కోసం ఎదురుచూపులు
ప్రధాన దవాఖానలో ఏన్నో ఏళ్ల నుంచి ఎంఆర్ఐ స్కానింగ్ లేక ప్రైవేట్ వైపునకు వెళ్లడంతో ఆర్థిక భారం పడుతుందని, వెంటనే ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. డిజిటల్ ఎక్స్‌రేలకు ఫిలింలు లేవని, ఎక్స్‌రే తీసుకునే ప్రతి రోగికి ఫిలింలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు దవాఖాన చుట్టూ ప్రహరీతో పాటు గదులను రెనోవేషన్ చేయాలన్న డిమాండ్ ఉన్నది. హాస్పిటల్లో 542 పడకలు ఉన్నప్పటికీ 700 మంది ఇన్ పేషెంట్లుగా ఉంటున్నారు. రోజుకు వెయ్యి మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు జరిగిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంగా కరీంనగర్ రికార్డు సాధించింది. అలాంటి దవాఖానను అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు కోరుతున్నారు.
వేదిస్తున్న మందుల కొరత
ఒకపక్క సీజన్ వ్యాధులు ప్రబలుతుంటే కరీంనగర్ ప్రభుత్వ దవాఖానను మాత్రం మందుల కొరత తీవ్రంగా వేదిస్తోంది. ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా వారికి సరిపడా మందులు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జ్వరంతో బాధపడి వస్తున్న వారికి ప్రిస్కిప్షన్స్ రాసి ఇవ్వడం మినహా మందులు ఇవ్వడం లేదు. ఇటీవల జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటు చేసినా రోగులు వాటిని వాడేందుకు ముందుకు రావడం లేదు. దీంతో బయట మందుల దుకాణాల్లో కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ముఖ్యంగా అజిత్రోమైసిన్, డైక్లో, ఐడ్రాప్స్, చర్మ సంబంధిత వ్యాధుల సంబంధించిన మందులు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు.
నేడు హెచ్‌డీఎస్ సమావేశం
హెచ్‌డీఎస్ (హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ) సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు దవాఖానలోని సమావేశమందిరంలో నిర్వహించనున్నారు. దీనికి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ మొదటిసారిగా హాజరవుతున్నారు. అలాగే కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ సునీల్‌రావు రానున్నారు. అయితే, కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ దవాఖానపై ప్రత్యేక శ్రద్ధ చూపారని, ఇప్పుడు కూడా దవాఖానలో ప్రత్యేక సదుపాయాలను మెరుగు పర్చి, అభివృద్ధికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. మంత్రిగా మొదటిసారి హెచ్‌డీఎస్ సమావేశానికి వస్తుండగా, ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నారు.