రాజన్న సిరిసిల్ల, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఆయన వెంటే సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలు రానున్నారు. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బూత్ లెవల్ కమిటీలతో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుతోపాటు ‘సర్’పై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు వేములవాడలో మహారాజ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్లో నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనుండగా, అందుకు జిల్లా నాయకులు అంతా సిద్ధం చేశారు.
వేములవాడ నియోజకవర్గంలో సుమారు 800 మంది కార్యకర్తలు.. సిరిసిల్ల నియోజకవర్గంలో 287 బూత్ కమిటీల్లో ప్రతి బూత్ కమిటీకి ఇద్దరు చొప్పున 574 మంది, 35 మంది సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు. సమావేశాల ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, సభ్యత్వ నమోదు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జిలు తుల ఉమ, గూడూరి ప్రవీణ్ ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట పార్టీ నాయకులు కందుల క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, రాఘవరెడ్డి, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, కొండ కనకయ్య, ప్రేమ్చారి తదితరులు ఉన్నారు.