Minister KTR | ఎల్లారెడ్డిపేట, మార్చి 2: ‘అన్నా అంటే నేనున్నా’ అంటూ ఆపదలో ఉండేవారికి అండగా నిలిచే మంత్రి రామన్న మరోసారి పెద్ద మనసు చాటారు. అడిగిన వెంటనే ఆటో అందించి ఓ నిరుపేద దివ్యాంగుడి కలను నెరవేర్చారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన ఆకారపు నర్సయ్యకు పుట్టుకతోనే రెండు కాళ్లు వంకరపోయాయి. ఆయన భార్య కొంతకాలం కిందట మరణించింది. ఇద్దరు కూతుళ్లు మాధురి, గౌతిమి ఉన్నారు. చేతనైనా పనిజేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రెండు రోజుల క్రితం మంగళవారం (ఫిబ్రవరి 28న) మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రాగా, నర్సయ్య బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకారంతో అమాత్యుడిని కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు. ఆటో ఇవ్వాలని వేడుకోగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడి ఆటో మంజూరు చేయించారు.
గురువారం ఎల్లారెడ్డిపేట తహసీల్ కార్యాలయం వద్ద కొత్త ఆటోను నర్సయ్యకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో కలిసి ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు అందజేశారు. పేదల బాధను విని స్పందించడంలో రామన్న గుండె చప్పుడయ్యాడని కొనియాడారు. మాట ఇచ్చిన 24 గంటల్లో ఆటోను అందించడం సంతోషకరమని చెప్పారు. ఆటోను అందించడంతో నర్సయ్య ఆనందంలో మునిగిపోయాడు. తన ఇద్దరు కూతుళ్లను ఆటోలో కూర్చోబెట్టుకొని తిప్పాడు. ఇక్కడ సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అపేరా సుల్తానా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్‌కుమార్, తహసీల్దారు జయంత్ కుమార్, ఎంపీడీవో చిరంజీవి, నాయకులు మాజీద్, రమేశ్, బాల్‌రెడ్డి, ఉదయ్ తదితరులు ఉన్నారు.
నాకు పుట్టినప్పటి నుంచే కాళ్లు వంకరపోయినయ్. భార్య ఆరునెలల కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఇద్దరు బిడ్డలున్నరు. వారిని పోషించేందుకు అష్టకష్టాలు పడుతున్న. గిసొంటి టైంల మంత్రి కేటీఆర్ అడిగిన వెంటనే ఆటో ఇచ్చిండు. నడుపుకుంటూ బిడ్డలను సాదుకుంట. ఆదుకున్న మంత్రి కేటీఆర్‌ను బతికింత కాలం యాది మరువ. జీవితాంతం రుణపడి ఉంట. సహకరించిన నాయకులకు నా కృతజ్ఞతలు.
– ఆకారపు నర్సయ్య, నారాయణపూర్ (ఎల్లారెడ్డిపేట)