కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 13 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా ముచ్చటిస్తూ, వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల పిల్లల వివాహాలకు హాజరైన కేటీఆర్, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.
ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్గునూర్లో గల ఉన్నతి ఫంక్షన్లో న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు కూతురు నాగప్రణవి, అభిరాం వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వీ కన్వెన్షన్లో, మల్కాపూర్ రోడ్డులోని పీవీఆర్ గార్డెన్లో జరిగిన వివాహాలకు హాజరై, వధూవరులను దీవించారు. తర్వాత వేములవాడ, సిరిసిల్లలో జరిగిన వేడుకలకూ హాజరయ్యారు. ఆయాచోట్ల అభిమానులు, మహిళలు ఆయనతో సెల్ఫీలు దిగగా, యువకులు ‘జై కేటీఆర్’ అంటూ నినదించారు.