National scholarship | ధర్మారం, జూన్6: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి నెరువట్ల చేతన్ జాతీయ ఉపకార వేతనం కోసం ఎంపికయ్యాడు. ఈ విద్యార్థికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకారం వేతనం అందుతుంది. చేతన్ 2024 -25 విద్యా సంవత్సరంలో ఆ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపిక కోసం నోటిఫికేషన్ వెలువడగా గత ఏడాది నవంబర్ 24న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పరీక్ష రాశాడు.
దీంతో ఇటీవల ఫలితాలు వెలువడగా విద్యార్థి చేతన్ అట్టి ఉపకార వేతనం పొందడానికి అర్హత సాధిస్తూ ఎంపికయ్యాడు. ఈ మేరకు విద్యార్థి చేతన్ ఎంపికైనట్లు పాఠశాలకు సమాచారం వచ్చింది. ఈ విద్యార్థికి ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఉన్నత చదువులు చదవడానికి ఏడాదికి రూ.12,000 చొప్పున జాతీయ ఉపకార వేతనం అందనుంది. బడిబాట కార్యక్రమం సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పాఠశాలలో విద్యార్థి చేతన్ ను పాఠశాల హెడ్ మాస్టర్ కే సత్యం, సహ ఉపాధ్యాయులు సుజనా రెడ్డి, పీ మురళి, ఆర్ శ్రీనివాస చారి, కే కనకయ్య, ఏ మధుకర్, ఏవీ శేషగిరిరావు, బి శ్యామల, కే మల్లయ్య, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఏ మధు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.