మెట్పల్లి/కోరుట్ల, ఆగస్టు 31 : ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆదివారం అసెంబ్లీ జీరో అవర్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తామని గొప్పలు చెప్పి, ఇప్పుడు కనీసం బిల్లులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. ఆదివారం నుంచి ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం బాధాకరమన్నారు. ప్రైవేట్ మెడికల్ ట్రీట్మెంట్కు సంబంధించి బిల్లులు చెల్లించడం మానేసిన తర్వాత ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లేషన్ యాక్ట్ గురించి ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఒకటి కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు.
‘మంచం పట్టిన మన్యం’ అని నా చిన్న వయసులో విన్నానని, మళ్లీ ఇప్పుడు ఇలాంటి వార్తలు చూడాల్సిరావడం బాధాకరమన్నారు. మెట్పల్లి దవాఖాన సమస్యలపై ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి వివరిస్తే.. ఆయన స్పందించి దవాఖాన బిల్లులు వెంటనే విడుదల చేయాలని, మిగతా పనులు పూర్తయ్యేలా చూడాలని తన ముందే ఫోన్ చేశారని గుర్తు చేశారు. కానీ, అధికారులు మాత్రం అటువైపు చూసిన దాఖలాలు లేవన్నారు. ఆశ కార్యకర్తలకు 2500 ఉన్న వేతనాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 వేలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 వేలకు పెంచుతామని మాట ఇచ్చిందని, ఇప్పుడు తప్పడం సరికాదని హితవు పలికారు. కోరుట్లలో 100 పడకల దవాఖాన ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా కొత్తగా స్టాఫ్‌ను నియమించలేదని చెప్పారు. ఏరియా దవాఖానలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, వైద్య పరికరాలు లేక బోసి పోయిందన్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలని, స్పీకర్ చొరవ చూపాలని ఎమ్మెల్యే కోరారు.