కోరుట్ల, ఏప్రిల్ 25: ప్రభుత్వ ఏరియా దవాఖాన అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డి నిధులు రూ. 2 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోరుట్లలో ప్రజల సౌకర్యార్థం రూ. 12 కోట్లతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహకారంతో వంద పడకల దవాఖాన నిర్మించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా దవాఖాన అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రులను పలుమార్లు కలిసి దవాఖాన అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. దవాఖాలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, అన్వర్, రవీందర్, ఆనంద్, దవాఖాన సూపరింటెడెంట్ సునీతారాణి, వైద్యులు వినోద్, రమేశ్, రామకృష్ణ, ఉదయ్‌కుమార్, సంతోష్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నిలిచారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. పట్టణ శివారులోని శివసాయి గార్డెన్లో శుక్రవారం ఆయన పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను పాత్రికేయులకు అందజేశారు.
ఈ అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నంబర్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సాగు, తాగునీరు, 24 గంటల కరెంట్ అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు చీటి వెంకట్రావు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.