గోదావరిఖని, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో బీసీలను వంచించింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన సర్వేలో తగ్గించి చూపారని మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం కోరుకంటి చందర్ అధ్యక్షతన బీసీ కుల సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కులగణన సర్వేలో ఐదున్నరశాతం బీసీల జనాభాను తగ్గించి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహించారు. కులగణనపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం మళ్లీ సర్వే చేపడుతున్నదని విమర్శించారు. బీసీలకు 42శాతం విద్య, ఉద్యోగ రాజకీయాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ వర్గాలకు సబ్సిడీపై బ్యాంకు రుణాలు, ఆదాయపుపన్ను మినహాయింపు చేయాలని, ఏబీసీ మంత్రిత్వశాఖను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలని, కార్యనిర్వాహక న్యాయ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజ్యాంగ సవరణ చేసి 50శాతం నిబంధన ఎత్తివేయాలని బీసీ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు.