పెద్దపల్లి, నవంబర్ 26(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, ఈ తరుణంలో ప్రజలను చైతన్యం చేద్దామని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి ఎండగడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్దేశం చేశారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ దేశాన్నే కుదిపేసిందని, ఉద్యమాన్ని మలుపు తిప్పిందని గుర్తు చేశారు. నవంబర్ 29 చరిత్రలో దీక్షా దివస్‌గా నిలిచిందని చెప్పారు.
తెలంగాణ దేశంలోనే ముందువరుసలో నిలుస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని, కానీ, పదకొండు నెలలైనా ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ల మాటలకు మోసపోతే గోసపడుతామని కేసీఆర్ ఆనాడే చెప్పారని, అదే ఇప్పుడు నిజమవుతున్నదన్నారు. ప్రజల మేలు కోరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తుంటే, ప్రభుత్వం పగబట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, రఘువీర్ సింగ్, గంట రాములు, మురళీధర్‌రావు, గోపు ఐలయ్య యాదవ్, తగరం శంకర్‌లాల్, ఎక్కేటి అనంతరెడ్డి, ఏగోళపు శంకర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, నారాయణ, ఉప్పు రాజ్‌కుమార్, ముబీన్, పూదరి చంద్రశేఖర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
గద్దె దింపేందుకు దోహదపడాలి
నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్నే మలుపు తిప్పింది. రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికింది. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న ఈ దీక్షా దివస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గద్దె దింపేందుకు దోహదపడాలి. ఈ నెల 29న నిర్వహించే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
హామీల అమలులో సర్కారు విఫలం
కాంగ్రెస్ ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజల్లో కూడా ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్‌ను గద్దె దించడమే ధ్యేయంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. 29న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలి.
– దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే