సిరిసిల్ల టౌన్, మే 21: ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు ధ్వజమెత్తారు. పాలన చేతగాకే కేసీఆర్‌ను బద్నాం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తున్నదని సొంత పార్టీ నాయకులు, మంత్రులే స్వయంగా చెబుతున్నారని విమర్శించారు. సిరిసిల్లలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పదిహేడు నెలల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, అంతా కమీషన్ల పంపిణీపై ప్రభుత్వ పాలన నడుస్తున్నదని ఆరోపించారు.
డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు నాడు ఇరిగేషన్‌శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం విచారణ చేయడంలో తప్పు లేదని, ఓ పత్రిక వార్తా ఆధారంగా దోషులుగా చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే నోటీసులు జారీ చేశారని తాము భావిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఇటీవల స్వయానా ఓ మంత్రి అందరు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పిన విషయం ద్వారానే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందన్నారు. సాధించుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా కేసీఆర్ పని చేశారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను దోషిగా చూపాలన్న దురుద్దేశంతోనే పని చేస్తున్నదని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజి కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ప్రజలకు కష్టాలు వస్తాయని నానుడి ఉన్నది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇది అక్షరాలా నిజమే అనిపిస్తుంది. రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిండు. ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. వృద్ధులు, వితంతువులు ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నరు. ప్రజల దృష్టిని మరల్చే విధంగా కాళేశ్వరం కమిషన్ పేరు మీద కేసీఆర్‌కు నోటీసులు పంపిన్రు. ఇది రాజకీయ కక్షే. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నం. కేసీఆర్ తెలంగాణ సాధించడం వల్లే ఈ రోజు రేవంత్‌రెడ్డి సీఎం అయిండు.
ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆంద్రోళ్ల సంచులు మోసుకుంటూ ఉండెటోడు. కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పంప్‌హౌస్‌లు, అప్పర్‌మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు నిర్మించిండు. తెలంగాణను సస్యశ్యామలం చేసిండు. కానీ, మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం నిర్మాణమే లోపభూయిష్టంగా ఉందని కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నరు. ప్రభుత్వం వేసిన కమిషన్ నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తరు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచక పాలనను ప్రజలు తిరస్కరిస్తరు.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు