International Intellectual Peace Award | జగిత్యాల, ఆగష్టు 30: సామజిక సేవకు మారు పేరుగా, ఆపదలో ఉన్న దయార్థులకు ఆపద్భాంధవుడిగా పేరు గాంచిన ప్రముఖ సామాజిక సేవకుడు, టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్ కు అత్యున్నత పురస్కారంతో అరుదైన గౌరవం దక్కింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బండ శంకర్ సామజిక సేవలో గత కొన్నేళ్లుగా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందరి చేత ప్రశంసలు పొందారు. జనని స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించిన అయన ప్రమాదాల బారిన పడిన నిస్సహాయులకు అవసరమైన రక్తదానం చేపించడంలో అందరికన్నా ముందు వరుసలో నిలిచారనడంలో ఎలాంటి అతిషయోక్తి లేదు.
ఊరు, పేరు, గుర్తింపు లేకుండా మృతి చెందిన ఎందరో అనాధ శవాలకు పెద్ద కొడుకై దహన సంస్కారాలు నిర్వహించి తన ఔధర్యం చాటుకున్నారు. భిక్షటన చేస్తూ అపరిశుభ్రంగా ఉంటూ, అనారోగ్యంకు గురైనా ఎందరో వృద్ధులను చేరదీసి, స్నానం చేయించి, క్షవరం తీయించి, కొత్త బట్టలు అందించి, వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఓల్డ్ ఏజ్ హోమ్, కేర్ సెంటర్ లకు తరలిస్తూ వారికి అపద్భాంధవుడిగా నిలిచారు. తను చేసిన సేవలకు గుర్తింపుగా వర్మ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, గత ప్రభుత్వం లో రక్తదాతగా, సామజిక సేవకునిగా జిల్లా స్థాయిలో ఎంపికైనా బండ శంకర్ అవార్డుతో పాటు రివార్డు సైతం అందుకున్నారు.
గానకోకిల కళానీకెతన్ నుండి సేవారత్న, దళిత సంఘాల తరుపున దళిత రత్న లాంటి అనేక అవార్డులు అందుకున్నారు. సేవే లక్ష్యం – ప్రేమే మార్గం అనే నానుడిని నిజం చేస్తూ సేవ రంగంలో ముందుకు సాగుతున్న బండ శంకర్ కు మరో అరుదైన అవార్డు దక్కింది. పంజాబ్ లోని చంధిఘడ్ లో గల రాడిషన్ హోటల్లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా మైత్రి పీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు పంపిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బుద్ధ పీస్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్బంగా సామజిక సేవకుడు, టీపీసీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్ కు అవార్డు రావడం పట్ల పలువురు అయన మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, పుర ప్రముఖులు పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషకారంగా ఉందని, ఈ అవార్డు తన బాధ్యతను మరింతగా పెంచిందని భావిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. తనకు అభినందనలు తెలిపిన వారికి శంకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.