కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 17: కోల్‌కతాలోని ఆర్జీకార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వైద్యులు ఆగ్రహించారు. ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలను బంద్‌పెట్టి ఆందోళనకు దిగారు.
వందలాదిగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రెండువేల మంది డాక్టర్లు, మెడికోలు బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాంకిరణ్, డాక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. దవాఖానల్లో మహిళా వైద్యసిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పాలకుల ఉదాసీనతతోనే మహిళా వైద్యులు, నర్సింగ్, ఆరోగ్య సిబ్బందిపై భౌతిక దాడులు, నేరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. చల్మెడ, ప్రతిమ వైద్య కళాశాలల వైద్యులు, మెడికోలతోపాటు మెడికల్ రిప్లు పాల్గొనగా, న్యాయవాదులు, ఉపాధ్యాయులు సంఘీభావం ప్రకటించారు.