కోనరావుపేట, మే 3: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో పురాతన ఆలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉద్ఘాటించారు. పేదల దేవుడిగా రాజన్న క్షేత్రం వెలుగొందుతున్నదని, ఈ ఆలయాన్ని యాదాద్రి తరహాలో సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని స్పష్టం చేశారు. వేములవాడకు దగ్గరలో ఎత్తయిన ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విరాజిల్లుతున్న నాగారం గ్రామా న్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పా రు. కోనరావుపేట మండలంలోని నాగారంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునః ప్రతిష్ఠపానోత్సవాలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ, దైవ చింతన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధితోపాటు సాగు, తాగు నీరు లాంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని 80లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. ఆలయానికి నూత న శోభ తీసుకువచ్చేందుకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ముందుగా 30లక్షలు మంజూరు చేసిన తర్వాత ఎమ్మెల్యే కొట్లాడి మరో 50లక్షలు మంజూరు చేయించుకున్నారన్నారు.
అనాది కాలం నుండి చెన్నమనేని వంశీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు వేములవాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఈ ఆలయానికి ప్రధానంగా ఘాట్ రోడ్డు కోసం 9లక్షలు మంజూరయ్యాయన్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు కోరిక మేరకు వేములవాడ నాగారంలో సిరిసిల్ల తరహాలో ఒక అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే పర్యాటక శాఖ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని చెప్పారు. ప్రముఖులు పుట్టిన నాగారం గడ్డను వారు అభివృద్ధి చే యడానికి కార్యోన్ముకులయ్యారని కొనియాడారు. అనంతరం దేవాలయ పునఃప్రతిష్ఠతో పాటు శ్రీసీతారామస్వామి ఆలయంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పూజలు చేశారు. ఎమ్మె ల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి స్వామివారి కల్యాణ ఘట్టాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ చైర్మన్ గుడూరి ప్రవీణ్, రాష్ట్ర పశుగాణాభివృద్ధి సంస్థ చైర్మన్, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామరావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, జడ్పీటీసీలు మీనయ్య, మ్యాకల రవి, సెస్ వైస్ చైర్మన్ దేరకొండ తిరుపతి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నా మొదటి సంతకం సంక్షేమ ఫైలుపైనే చేశా
కొత్త సచివాలయంలోని నా చాంబర్లో మొదటి సంతకం సంక్షేమానికి సంబంధించిన ఫైలుపై చేశా. సచివాలయంలో కొలువుదీరిన తర్వాత యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకోవడం ఆనందంగా ఉన్నది. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పాలకమండలిని నియమిం చాం. ఇంకో ఐదారు దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణలో భాగంగా వేయలేదు. సీఎం తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం.
– వేములవాడ రాజన్న దర్శనం అనంతరం మంత్రి ఐకే రెడ్డి
ఆలయాలకు పూర్వవైభవం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం వస్తున్నది. ఆలయాలకు అనేక నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. యాదాద్రితో పాటు వేములవాడ రాజన్న క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఏరాష్ట్రంలో లేని విధంగా ఆలయాలకు ధూపదీప నైవేద్యం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. నాగారంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక చొరవ చూపి పునరుద్ధరించారు. ఆలయానికి ప్రధానంగా ఘాట్ రోడ్డు ఏర్పాటు చేసి భక్తుల ఇక్కట్లు తీర్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషకరం.
-బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
దేవాలయ పునః ప్రతిష్ఠ గొప్ప విషయం
శ్రీ కోదండ రామస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ గొప్ప విషయం. మా తాతలు, తండ్రులు నివసించిన ప్రాంతం కావడం అదృష్టంగా భావిస్తున్నా. 1978లో మా తాత చిన్న దేవాలయాన్ని చెట్టు కింద నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో చెన్నమనేని విద్యాసాగర్‌రావు అంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గానికి నూతన శోభ తెచ్చారు. కానీ, ఆ విగ్రహం భిన్నమైంది. ఆ విగ్రహ స్థలంలోనే 80లక్షలతో ఎత్తయిన ఆంజనేయ విగ్రహాన్ని నిర్మిస్తా. ఇప్పటికే మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి ఐకేరెడ్డి సహకారంతో ఆలయాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దడం సంతోషంగా ఉంది. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు నాగారం దగ్గరలో ఉన్నందున రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదుతాం. గుట్టపై అర్బన్ పార్క్ కూడా నిర్మించేందుకు పర్యాటక శాఖ దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి ఐకే రెడ్డి కూడా హామీ ఇచ్చారు.
-చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే
ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది
నాగారం శ్రీ కోదండ రామస్వామి ఆలయం రానున్న రోజుల్లో ఆధ్మాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. చిన్నప్పటి నుంచి కోదండ రాముడి గుట్ట అంటే ఎంతో ఇష్టం. కరీంనగర్ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు తిరిగినా ఈ ఆలయానికి వస్తే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నా పేరు ఎప్పుడు కూడా కోదండ రామారావుగా ఉంటే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నా. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న హనుమాన్ విగ్రహం భిన్నం కాగా ఆ విగ్రహాన్ని మళ్లీ నిర్మించేందుకు మంత్రి కేటీఆర్ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రమేశ్‌బాబు చెప్పారు. ఆలయానికి ఎమ్మెల్యే ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడంతోపాటు ఈ గుట్ట ప్రాంతంలో ప్రభుత్వం హరితహారం మొక్కలు నాటడం సంతోషకరం.
-చెన్నమనేని విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్