ఒకనాడు నష్టాలతో మూసివేత దిశగా సాగిన కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ (కేడీసీసీబీ), ఇప్పుడు సహకార రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. సహకార రంగంలో ఉన్న లోపాలు, నష్టాలను అధిగమిస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇప్పుడు ఏకంగా 7,500 కోట్ల వ్యాపారానికి తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. అక్కడితో ఆగకుండా ఎనిమిదేళ్లుగా దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా అవార్డులను సొంతం చేసుకుంటున్న కేడీసీసీబీ, ఇప్పుడు తొమ్మిదోసారి అవార్డును తన ఖాతాలో వేసుకుంటున్నది. 108 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ అలయన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 27న న్యూఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ సహకార సదస్సు వేదికపై కేంద్ర హోంశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డును బ్యాంకు అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, సీఈవో నందెల్లి సత్యనారాయణరావు అందుకోనున్నారు. తద్వారా బ్యాంకు ప్రతిష్ట మరోసారి నలుదిశలా పెరగనుండగా, భవిష్యత్‌లో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్న తీరుపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2005-06లో కేడీసీసీబీ చరిత్ర చూస్తే మొత్తం నష్టాలే. సుమారు రూ.59 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ బ్యాంకు మూసివేత దిశగా అడుగులు పడ్డాయి. మనుగడే ప్రశ్నార్థకమన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి సహకార రంగంలో ఆనాడు ఉన్న లోపాలే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి సహకార బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఓ చరిత్ర ఉంది. 1921లో సభ్యులు తమ బాగు కోసం స్థాపించుకున్న సహకార కేంద్ర బ్యాంకులు, సహకార సంఘాలు మొదట్లో సభ్యులకు సహకారం అందించాయి. దాదాపు 60 నుంచి 70 శాతం వరకు సభ్యుల ఆర్థిక అవసరాలు తీర్చాయి. కానీ, రానురాను మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా సహకార మూలసూత్రాలను పక్కన పెట్టి సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, తమ స్వార్థం కోసం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. సేవలను విస్తరించక పోగా, డిపాజిట్‌దారులకు సొమ్ములను చెల్లించలేని స్థితికి తెచ్చారు. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. కేడీసీసీబీది కూడా ఇదే పరిస్థితి. 2005-06లో 59 కోట్ల వరకు నష్టాల్లో ఉన్నది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 11(1) నిబంధనలను పాటించ లేదని ఏకంగా బ్యాంకును మూసివేసే దుస్థితి వచ్చింది.
ఇప్పుడు దేశంలోనే టాప్
ఒక నాడు నష్టాలే తప్ప లాభాలు తెలియని కేడీసీసీ బ్యాంకు ఇప్పుడు లాభాల్లోనే కాదు, పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా ముందుకు సాగుతున్నది. నిజానికి 2005-06లో బ్యాంకు తీవ్ర నష్టాల్లో ఉండగా.. ఆ సమయంలోనే (2005) బ్యాంకు అధ్యక్షుడిగా కొండూరు రవీందర్రావు బాధ్యతలు చేపట్టారు. సహకార రంగంపై అనుభవం ఉండడం, మంచి విద్యావేత్త కావడంతో బ్యాంకు నష్టాల్లోకి వెళ్లడానికి గల కారణాలను పూర్తిగా అన్వేషించారు. ఆ లోపాలను ఒక్కొక్కటిగా అధిగమించడమే కాకుండా, వివిధ దేశాల్లో సహకార రంగంలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేశారు. వాటిని కేడీసీసీ బ్యాంకుకు అనుసంధానం చేస్తూ వచ్చారు. వ్యవస్థను బాగుచేయాలనే లక్ష్యంతో మార్పు తీసుకొచ్చి, సహకార రంగానికి వన్నె తేవాలన్న ఆకాంక్షతో పనిచేశారు. ఇదే సమయంలో సిబ్బందిని ఏకతాటిపైకి తెచ్చి, కాలంతో పోటీ పడేందుకు అవసరమైన శిక్షణ ఇస్తూ ప్రోత్సహించారు.
ప్రధానంగా ఖాతాదారులకు సిబ్బందికి మధ్య చక్కని సమన్వయం ఏర్పడేలా చూశారు. ఫలితంగా బ్యాంకు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. 2005-06లో మూసివేత వరకు వెళ్లిన బ్యాంకు, 2011-12 ఆర్థిక సంవత్సరం వరకు నష్టాలను పూడ్చుకొని, 2015-16 సంవత్సరం నుంచి దేశంలోని అత్యున్నత సహకార బ్యాంకుగా ఎదిగింది. నాబార్డు వంటి సంస్థలతో ప్రశంసలు అందుకున్నది. అక్కడితో ఆగకుండా బ్యాంకు పరిధిలో 42 కొత్త శాఖలను ప్రారంభించి, సేవలను విస్తృతం చేసింది. బ్యాంకుల అభివృద్ధి కోసం నాబార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకొన్నది. నాబార్డు, సహకారచట్టంలోని నిబంధనలు, రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర బ్యాంకుల నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి తన పాలసీలు పెంపొందించుకొని బ్యాంకు, సంఘాల అభివృద్ధి కోసం దూసుకెళ్తున్నది. ముఖ్యంగా రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నది. ఒకవైపు బ్యాంకు సేవల విస్తరణతోపాటు మరోవైపు కొండూరు సైతం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2015లో రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, 2019 డిసెంబర్లో జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్యకు చైర్మన్‌గా ఎన్నికైన కొండూరు.. దేశ, రాష్ట్ర సహకార రంగంలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు.
జోడెద్దుల మాదిరిగా..
కొండూరు అందించిన సేవలు, సూచనలను అందిపుచ్చుకున్న బ్యాంకు సీఈవో నందెల్లి సత్యనారాయణరావు అదే జోరుతో బ్యాంకును ముందుకు తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషించారు. బ్యాంకు పాలకవర్గం, పాలసీ మేకింగ్‌ల వంటి వాటికే పరిమితమైన రవీందర్రావు.. రోజువారీ బ్యాంకు కార్యకలాపాల బాధ్యతలను ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణరావుకు అప్పగించారు. ఇద్దరి అవగాహన, పరస్పర సహకారం వల్ల కేబీసీసీబీ 2015-16 నుంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తున్నది. నేటికి ఆ ప్రస్థానాన్ని అలాగే కొనసాగిస్తున్నది. అన్ని విషయాల్లోనూ ముందుకు సాగింది. ముందుగా సభ్యులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు మాత్రమే మంజూరు చేయగా, ఆ తర్వాత ఖాతాదారులకు అవసరమైన రుణ పథకాలను ప్రవేశపెట్టింది. ఇతర వాణిజ్య బ్యాంకులకు దీటుగా ముఖ్యంగా గ్రామీణ సన్న, చిన్నకారు రైతులకు, చేతివృత్తి దారులకు, వాణిజ్య వ్యాపార వర్గాల వారికీ రుణాలు మంజూరు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించింది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రుణాలకే పరిమితం కాకుండా.. గృహనిర్మాణాలు, విదేశాల్లో పిల్లల చదువులు, పౌల్ట్రీ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపనకు అర్హత మేర రుణాలు ఇస్తూ వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ప్రతి రైతుకూ ఎరువుల విక్రయం, పెస్టిసైడ్స్, నాణ్యమైన విత్తనాల సరఫరాతోపాటు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు వంటి కార్యకలపాలను విస్తరించి లాభాల బాట పట్టింది. అంతేకాకుండా 4 శాతం వడ్డీతో సంఘాల్లో మౌలిక వసతులను కల్పించడం, ప్రతి సంఘానికీ కార్యాలయ భవనం, స్ట్రాంగ్ రూమ్, లాకర్స్, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ పంపుల నిర్మాణం, ఆర్వో వాటర్ ప్లాంట్స్, కామన్ సర్వీస్ సెంటర్స్, జన ఔషధ కేంద్రాలు స్థాపించి, సభ్యులకు సేవలందిస్తున్నది. ఇదే సమయంలో సంఘ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత తెచ్చేందుకు 2016లో అన్ని సంఘాలను కంప్యూటీకరణ చేసింది. ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటివి అమలు చేసింది. ఫలితంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7,500కోట్ల వ్యాపార లావాదేవీలకు బ్యాంకు వెళ్లింది.
రేపు కేంద్ర మంత్రి చేతులమీదుగా అవార్డు
కేడీసీసీబీ ఉత్తమ సేవలకు గాను నిజానికి 2015-16 నుంచి అవార్డులను అందుకుంటున్నది. ఇప్పటికే ఎనిమిది సార్లు అవార్డును అందుకున్న బ్యాంకు, తాజాగా మరోసారి అందుకోబోతున్నది. దేశంలో 352 డీసీసీబీల్లో ప్రతిభ చూపి 2023-24 సంవత్సరానికి అత్యుత్తమ బ్యాంకుగా ఎంపికైంది. 108 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 27న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే అంతర్జాతీయ సహకార సదస్సులో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా బ్యాంకు అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు, బ్యాంకు సీఈవో నందెల్లి సత్యనారాయణ రావు అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా రవీందర్రావు, సత్యనారాయణరావు మాట్లాడుతూ.. బ్యాంకు ఉత్తమ పనితీరు, వ్యాపార విస్తరణలో పాలు పంచుకున్న 550 మంది బ్యాంకు సిబ్బంది, సంఘాల్లో పనిచేస్తున్న 800మంది సిబ్బందితోపాటు సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, బ్యాంకు ఖాతాదారుల సహకారం మరువలేనిదని చెప్పారు. బ్యాంకును ప్రగతి పథంలో నడుపడంలో భాగసాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.