తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 12: దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దళితులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో బహుజన సమాజ్‌వాది పార్టీకి చెందిన సుమారు వంద మంది నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జి సంగుపట్ల మల్లేశం ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ..
అంబేద్కర్ ఆలోచనా విధానంతో సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. దళితబంధును ప్రవేశపెట్టి రూ.పది లక్షలు ఇవ్వడం దేశంలో గొప్ప ఆత్మగౌరవ నినాదంగా మారిందన్నారు. పార్టీలో చేరిన సంగుపట్ల మల్లేశం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తోనే దేశ వ్యాప్తంగా దళితులకు ఆత్మగౌరవం పెరుగుతుందనే నమ్మకంతోనే బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. దళితబంధు గొప్ప పథకమని, ఎంతోమంది ఆర్థికంగా స్థిరపడి ఆత్మగౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమయ్యే పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వీ బెలూన్స్, డెకరేషన్స్ షాప్‌ను ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పొరండ్ల సొసైటీ చైర్మన్ స్వామిరెడ్డి, ఆత్మచైర్మన్ అశోక్‌రెడ్డి, ఎలుక ఆంజనేయులు, కిన్నెర సారయ్య, గుజ్జుల ప్రణీత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.