MLA Padi Kaushik Reddy | హుజూరాబాద్ టౌన్, జూలై 7 : భారతదేశంలోనే ఆడబిడ్డల కోసం ఆలోచించి కేసీఆర్ కిట్ వంటి అద్భుతమైన పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆరే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమలాపూర్ మండలానికి చెందిన దాదాపు 100 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా కల్యాణలక్ష్మీ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామలా సాయం అందించారన్నారు. రూ.50వేల నుంచి మొదలు పెట్టి రూ.లక్ష పెంచారని అన్నారు. పేద దళితులతో ప్రారంభించి, రాష్ట్రంలోని అన్ని కులాల నిరుపేదలకు పథకాన్ని అమలు పరిచారని గుర్తు చేశారు. అలాగే గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లు, ప్రభుత్వాసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిస్తే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలను గత కేసీఆర్ ప్రభుత్వం అందించిందని చెప్పారు. కేసీఆర్ కిట్లు అందించి, 102 వాహనంలో బాలింతను ఇంటి వద్దకు సాగనంపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు అందడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని, జైలుకు పంపాలని చూస్తుందన్నారు. పేద ప్రజలకు లాభం జరుగుతుందంటే, తను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన అన్నారు.
పేదలకందే పథకాలపై రాజకీయలకు తావివ్వకుండా పథకాలు అమలు చేయాలన్నారు. కేసీఆర్ కిట్ నిలిపివేయడంతో ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు గణనీయంగా తగ్గాయని అన్నారు. పథకం పేరు మార్చైనా సరే పథకాన్ని అమలు చేయాలన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం నిరుపేదలకు ఎంతో మేలు చేస్తుందని, రాజకీయాలకు తావివ్వకుండా పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిందన్నారు. కనీసం పేరును సైతం మార్చలేదన్నారు. గతంలో తీసుకున్న రెండు మూడు సిమెంట్ బస్తాల బూచిని చూపెట్టి పేదలకు ఇందిరమ్మ ఇండ్లను దూరం చెయ్యడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలన్నారు. అలాగే, రైతులకు అందించే యూరియాను అందుబాటులో ఉంచాలని సూచించారు. కాళేశ్వరం నీళ్లను త్వరగా అందించాలని కోరారు.
తెలంగాణ రాకముందు రైతన్నలు అర్ధరాత్రి పొలాలకు పోయే పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు కరెంటు అందించడం ద్వారా మొబైల్ ఫోన్ల ద్వారానే మోటర్లను ఆపరేట్ చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో మన నీళ్లను ఆంధ్రకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతులకు నీళ్లివ్వకుండా ఆంధ్రకు తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2500, నియోజకవర్గంలోని లక్షా 26వేల మంది ఆడబిడ్డలకు అందించిన తర్వాతనే ఓట్లు అడగాలని, ఇవ్వకుంటే మహిళలే ఎలక్షన్లలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుబుతారని అన్నారు.
రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.12వేలు మాత్రమే అందిస్తుందని, ఇచ్చిన హామీ ప్రకారం రూ.15వేలు ఇవ్వాల్సిందేనని, ఈ లెక్కన ఒక్కొక్క రైతుకు ప్రభుత్వం రూ.లక్ష బాకీ పడిందని అన్నారు. ఇటీవల వచ్చిన పత్రికా కథనాలపై స్పందిస్తూ.. తెలంగాణ బీఆర్ఎస్ జాగీరేనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల మనస్సుల్లో నాటుకుపోయిన జాగీరని, తెలంగాణ ప్రజలకోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ రావు, మాజీ జెడ్పీటీసీలు నవీన్, ఇంద్రసేనా రెడ్డి, కేడీసీసీ డైరెక్టర్లు కృష్ణప్రసాద్, రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటికి కౌశిక్ అన్న పేరుతో ఇండ్ల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు
ఇంటింటికీ మన కౌశిక్ అన్న పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సోమవారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, కనుకులగిద్ద, జూపాక, చెల్పూర్, శాలపల్లి, ఇందిరానగర్, రాజపల్లి, రంగాపూర్ , రాంపూర్, సిర్సపల్లి, వెంకట్రావ్ పల్లి, పోతిరెడ్డి పేట, సింగాపూర్ గ్రామాలలో 31 మంది లబ్దిదారులకు రూ.7,88,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతీ నిరుపేదకు అండగా నిలుస్తానని అన్నారు.
ఆపద వస్తే అర్ధరాత్రైనా నేనున్నానంటూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని, దానిని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. అనారోగ్యంతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ సీనియర్ నాయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.