మానకొండూర్, అక్టోబర్ 17: బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్రజేశాయి. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేయడంపై భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మానకొండూర్ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మానకొండూర్‌లోని పల్లెమీద చౌరస్తా వద్ద కవ్వంపల్లి దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. ఈసందర్భంగా శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ, ఇటీవల మాజీ ఎమ్మెల్యే రసమయి మాట్లాడిన మాటలను వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇచ్చిన హామీలను అమలు చేయక రాజకీయ లబ్ధికోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గడిచిన పదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన రసమయి బాలకిషన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల శ్రీనివాస్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, పిట్టల మధు, దండబోయిన శేఖర్, రాచకట్ల వెంకటస్వామి, మర్రి కొండయ్య, మర్రి అశోక్ యాదవ్, పారునంది కిషన్, నెల్లి మురళి, పురం అనిల్, రాయికంటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.