Rasamayi Balakishan | గన్నేరువరం, ఆగస్టు 21 : గత ఎన్నికల హామీలో భాగంగా తాను ఎమ్మెల్యే గా గెలిచిన వంద రోజుల్లో గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పొత్తూర్ వరకు డబుల్ రోడ్డు పూర్తి చేస్తానన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చి 33నెలలు కావస్తున్నా రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించలేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని శుక్రవారం గన్నేరువరం నుండి గుండ్లపల్లి వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కకృతి పడడం తప్ప కంకర తేలిన రోడ్లవైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. రోడ్డు లేక మండల ప్రజలు అవస్థలు పడుతుంటే తాను మాత్రం కార్లలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రూ.71కోట్లు మంజూరు చేసి డబుల్ రోడ్ పనులు ప్రారంభించామని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేగా కవ్వంపల్లి గెలిచి 33 నెలలు కావస్తున్నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. డబుల్ రోడ్డు పనులు పూర్తి చేయమని యువజన సంఘాల నాయకులు అడుగుతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. డబుల్ రోడ్డు వేయడం చేతకాకపోతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, మండలానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మండలాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. నెల రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
గత ప్రభుత్వ పనులకే కొబ్బరి కాయలు కొడుతున్నరు..
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో ప్రతీ రోడ్డుపై పాదయాత్ర చేసి రోడ్లు వేపిస్తానని చెప్పిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న రోడ్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. నాటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతూ ప్రారంభిస్తున్నారే తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దారుణంగా విఫలమయ్యారన్నారు. డబుల్ రోడ్డు అనేది రాజకీయ అంశం కాదని ప్రజలకు సంబంధిచిందని, బీఆర్ఎస్ నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తుందని తెలిపారు. అనంతరం బీఆర్ ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్ పర్సన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీలు మాడుగుల రవీందర్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల నాయకులు విక్రమ్ రెడ్డి, గూడేల్లి ఆంజనేయులు, అటికం శ్రీనివాస్, పీచు మహేందర్ రెడ్డి, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గూడూరి సురేష్, రవి, వంశీకృష్ణారెడ్డి, ప్రభాకర్ పెద్ద సంఖ్యలో ప్రజలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.