జగిత్యాల, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా..? లేదా ఖాకీల రాజ్యమా..? అని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయించి వేధిస్తే సహింబోమని, కాంగ్రెస్ ఆగడాలను చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, చేయాల్సిన అభివృద్ధి పనులను పక్కన పెట్టి కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని హితవు పలికారు. ఇటువంటి వైఖరి ఎకువ రోజులు నిలబడదని, ప్రజలు తిరుగబడుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పెట్టిన అక్రమ కేసులు ఎదురొంటూ జగిత్యాల సబ్ జైలులో ఉన్న జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు గురువారం ఆమె మెట్పల్లి మీదుగా వెళ్లారు.
ముందుగా ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత జగిత్యాల వెళ్లి రాజేశ్వర్‌రెడ్డిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పరామర్శించారు. అధైర్య పడొద్దని, బీఆర్ఎస్ వెన్నంటి ఉంటుందని రాజేశ్వర్‌రెడ్డికి భరోసానిచ్చారు. అనంతరం విలేకరులతో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కేసీఆర్ సర్కారు హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే దౌర్జన్యాలు ప్రారంభించారని మండిపడ్డారు. ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, ప్రతి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు మోపుతూ భయపెడుతున్నదని విమర్శించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, హబ్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని సంబంధం లేని కేసులో ఇరికించి, జైలులో పెట్టించారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించడాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చట్టపరంగానే కాకుండా ప్రజాక్షేత్రంలో సైతం ఎదురొంటామని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసంక్షేమానికి పాటుపడిందే తప్ప ఇలాంటి నీచ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నామని, ఏ పార్టీ కార్యకర్తలపైన ఇలా వ్యవహరించలేదని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, చేయాల్సిన అభివృద్ధి పనులను పక్కన పెట్టి ఇలాంటి చర్యలకు దిగడం సరికాదని హితవు పలికారు. హైదరాబాద్ యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థినులను మహిళా పోలీసులు జుట్టు పట్టి లాగి పడగొట్టారని, ఇదెక్కడి పాలన అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పోలీసులు ఏనాడూ ఇలా వ్యవహరించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఒరవడి ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ హయాంలో జరుగుతున్న కక్షపూరిత చర్యలు, ఖాకీల దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఉద్యమాలు, పోరాటాలు చేసి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాని సమర్థవంతంగా పోషిద్దామని, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దాకా పోరాటం చేద్దామని, మళ్లీ ప్రజల మనసు గెలుచుకుందామని చెప్పారు. ఏదేమైనా కాంగ్రెస్ బెదిరింపులకు భయపడవద్దని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో కేసులు, అణిచివేతలకు ఎదురొడ్డి కొట్లాడామని, ఇప్పుడు తిరగబడి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆమె వెంట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు ఉన్నారు.