కథలాపూర్, జులై 22 : సాగునీటి కోసం కథలాపూర్ మండల రైతులు రోడ్డెక్కారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది మండల కేంద్రానికి తరలివచ్చారు. కోరుట్ల-వేములవాడ రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. బీమారం మండలం మన్నెగూడెం రైతులు కూడా పాల్గొన్నారు. వరదకాలువలో నీళ్లుంటాయనే నమ్మకంతో తాము నార్లు పోసుకున్నామని, మడులు సిద్ధం చేసుకొని నాట్లు వేసుకుందామంటే నీళ్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువలోకి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా, సంఘటన స్థలానికి కోరుట్ల సీఐ సురేశ్‌బాబు చేరుకొని రైతులతో మాట్లాడారు. ధర్నా విరమించాలని కోరగా, వరదకాలువ ద్వారా నీళ్లిస్తేనే విరమిస్తామని రైతులు తేల్చిచెప్పారు.
అనంతరం తహసీల్దార్ వినోద్ వచ్చి రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. రెండు రోజుల్లో వరదకాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ధర్నాలో మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య వంటావార్పు చేసేందుకు భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగం భూయయ్య, రైతులు, నాయకులు గడ్డం భూమారెడ్డి, గుండారపు గంగాధర్, వర్ధినేని నాగేశ్వర్రావు, కల్లెడ శంకర్, బద్దం మహేందర్‌రెడ్డి, పిడుగు ఆనంద్‌రెడ్డి, కంటె సత్యనారాయణ ఎండీ రఫీ, శ్రీకాంత్‌రెడ్డి, గంగారెడ్డి, రాజారెడ్డి, రాజం తదితరులు పాల్గొన్నారు.
వరదకాలువ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. తీరా నాట్లేసే సమయానికి నీళ్లు లేక గోస పడుతున్నాం. వరదకాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే పంటలు సాగు చేసుకొనే అవకాశం ఉంటుంది. వరదకాలువలో నీళ్లు లేకుంటే పంటలు ఎండుడే. మళ్లీ రైతులు గల్ఫ్ బాట పట్టాల్సి వస్తది. ప్రభుత్వం ఆలోచన చేసి వరదకాలువలో నీళ్లు ఉండేలా చూడాలి. అనవసరంగా రైతులతో రాజకీయం చేయద్దు. రైతు బాగుంటేనే దేశం బాగుటుంది.
– ఉమ్మడి అంజయ్య, రైతు (మన్నెగుడెం)
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరదకాలువ 365 రోజులు నిండుకుండలా ఉండేది. కానీ, కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నది. ప్రభుత్వం వెంటనే వరదకాలువలోకి నీటి విడుదల చేయాలి. లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తాం. ప్రభుత్వం రైతులపై కక్షతో ఇలా చేయడం సరికాదు. రైతులను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోం. రైతుల పక్షాన సరైన బుద్ధి చెబుతాం.
– బద్దం మహేందర్‌రెడ్డి, రైతు (భూషణరావుపేట )