కరీంనగర్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ, మత్స్యశాఖల అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు దక్కాయి. వ్యవసాయ శాఖకు జాతీయ స్థాయిలో రెండు జిల్లాలకు మాత్రమే అవార్డులు వచ్చాయి. ఒకటి మన కరీంనగర్ జిల్లా కాగా, మరొకటి పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లా! దేశవ్యాప్తంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లు మాత్రమే ఎంపికయ్యారు. ఈ నెల 7న ఢిల్లీలో జరిగిన సస్టెనైబులిటీ సమ్మిట్లో కలెక్టర్ పమేలా సత్పతి తరఫున జిల్లా వ్యవసాయ అధికారి జే భాగ్యలక్ష్మి, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భారతి, జమ్మికుంట కేవీకే పోగ్రాం కో ఆర్డినేటర్ నీలం వెంకటేశ్వర్ రావు అవార్డులు అందుకున్నారు.
జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సంక్షేమం కోసం సుస్థిర వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కలెక్టర్ పమేలా సత్పతికి ఇండో అగ్రి అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే మత్స్య సంపద అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి కరీంనగర్ జిల్లాలో అవలంభిస్తున్న వివిధ పద్ధతులకు గాను జిల్లా మత్స్య శాఖకు మరో అవార్డు దక్కింది. కాగా, శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతిని అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి ఢిల్లీలో అందుకున్న అవార్డులను అందించారు. సుస్థిర వ్యవసాయం కోసం, మత్స్య సంపద అభివృద్ధి కోసం కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ప్రత్యేక చర్యల నేపథ్యంలో జిల్లాకు రెండు అవార్డులు దక్కాయని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.