కార్పొరేషన్, ఫిబ్రవరి 23: కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతంగా నిర్మిస్తున్నామని, రాష్ట్రంలోనే కరీంనగర్ మహా నగరంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నగర అభివృద్ధిపై సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి సమీక్షించారు. మానేర్ రివర్ ఫ్రంట్, నగరంలో చేపడుతున్న రోడ్లు, చౌరస్తాల అభివృద్ధి పనులపై స్మితా సబర్వాల్‌కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతూ స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా పనిచేసినప్పడు కరీంనగర్ నగర అభివృద్ధికి ముందుండి పనిచేశారని, వారి తోడ్పాటుతోనే ప్రస్తుతం 14.5 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. దేశంలో సబర్మతీ నది తర్వాత అంతకుమించిన అభివృద్ధి, అద్భుతాలతో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌ను నిర్మించుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో చైనా, సౌత్ కొరియాలోని సియోల్ తర్వాత మన జిల్లాలోనే దాదాపు రూ.70 కోట్లతో అతిపెద్ద వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. కేబుల్ బ్రిడ్జితో పాటు డైనమిక్ లైట్ల, 10 x 30 సైజులో పెద్ద టీవీలను బ్రిడ్జికి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరద ఉధృతిని తట్టుకునేలా అప్పర్ ప్రామినెడ్, లోయర్ ప్రామినెడ్ నిర్మాణాలను సైతం చేపట్టామని, పనులన్నీ పూర్తిచేసుకొని ఆగస్టులోగా ప్రారంభించుకుంటామని చెప్పారు.
నావంతు సహకారం అందిస్తా : స్మితా సబర్వాల్
చారిత్రాత్మక నగరమైన కరీంనగర్ నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ పేర్కొన్నారు. రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన మీడియన్ ఎత్తును తగ్గించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. రెసిడెన్స్ ఏరియాలు, గృహసముదాయాల్లో అందమైన మొకలు నాటాలని, పారులను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో టాయిలెట్ల నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు. ఐడీఓసీ, ఇంటిగ్రేటెడ్ మారెట్ల నిర్మాణాలతో కరీంనగర్ మరింత అందంగా రూపొందనుందని, శానిటేషన్, నగర అభివృద్ధి పనులను నిత్యం జరిగేలా చూడాలని సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే పర్యటక శోభను ఆస్వాదించడానికి మహానగరాల నుంచి ప్రజలు కరీంనగర్‌కు దారిపడతారని తెలిపారు. నగర అభివృద్ధికి తన వంతు సహకారాన్ని కూడా అందిస్తానని తెలిపారు. వీటిని ఆగస్టు నాటికి పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని చౌరస్తాలను మరింత ఆకర్షణీయంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించి పాదాచారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పారు.
పనుల పరిశీలన
సమీక్ష సమావేశం అనంతరం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను సీఎంవో కార్యదర్శి పరిశీలించారు. కార్పొరేట్‌కు దీటుగా భవనాన్ని తీర్చిదిద్దాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన పాత భవనం కూల్చివేత, నూతన భవన నిర్మాణానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి తీగల వంతెనను సందర్శించారు. పనుల గురించి స్మితా సబర్వాల్‌కు మంత్రి వివరించారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఆర్డీవో ఆనంద్ కుమార్, ఆర్అండ్ బీఈఈ సాంబశివరావు, డీఈ రవీందర్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్ ఉన్నారు.